ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు కోసం ఉద్యోగుల వేతనాలనుండి 2 శాతం చందా చెల్లిస్తామని టీఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. 2 శాతం చందా అంగీకారం కాదని, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కోరింది. సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయా ప్రభుత్వాలదేనని ఆకారణంగానే మెడికల్ రీయింబర్స్మెంట్/ మెడికల్ అలవెన్సు సౌకర్యాలు కల్పించబడినాయని యుయస్పీసీ పేర్కొంది. కార్పోరేట్ వైద్యం ఖరీదైన కారణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ గరిష్ఠ పరిమితి పెంచాలని కోరిన సందర్భంలో 2008లోనే నగదురహిత వైద్యం ప్రతిపాదన మొదటిసారి చర్చకువచ్చింది.
ఇన్సూరెన్స్ కంపెనీలతో పలుదఫాల చర్చల తర్వాత ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల నుండి నామ మాత్రపు చందాతో నగదురహిత వైద్యం అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులపై పరిమితి లేకుండా నగదురహిత వైద్యం ఉచితంగా అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 నుండి మూడు సంవత్సరాలు నగదురహిత వైద్యం అందినప్పటికీ ఇటీవల (ప్రధానంగా కోవిడ్ ప్రబలినప్పటినుండి) కార్పోరేట్ హాస్పిటల్స్ ఆరోగ్య కార్డులపై వైద్యానికి అనుమతించటంలేదు. హాస్పిటల్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదనే కారణం చెప్తున్నాయి. బాధ్యత కలిగిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. లేదా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలతోపాటు ఉద్యోగులకూ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించమని డిమాండ్ చేయాలి. అందుకు భిన్నంగా అడక్కుండానే చందా ఇస్తాం కార్పోరేట్ వైద్యం అందించమని పదే పదే వేడుకోవటం కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీకి సహకరించటానికేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. పీఆర్సీ కమిటీ వద్ద ఏకపక్షంగా వైద్యానికి 1 శాతం చందా ఇస్తామన్నారు. ఉద్యోగులు ఇస్తామంటున్నారు కనుక ప్రభుత్వం ఒకశాతం చందా మినహాయించుకుని నగదురహిత వైద్యం అమలు చేయమని సిఫారసు చేసింది.
ఆ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే రెండు శాతం చందా ఇస్తామని అంగీకారపత్రం ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాము. దేశంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు అంతకంటే తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య భీమా పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఆయా పథకాలను వినియోగించుకుంటున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వానికి చందా కట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఉద్యోగులు అందరికీ టిఎన్జీఓ సంఘం మాత్రమే ప్రతినిధి కాదు. ఇంకా పలుసంఘాలున్నాయి. ఉద్యోగుల్లో సగానికిపైగా ఉన్న ఉపాధ్యాయులు వివిధ సంఘాల్లో ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమగ్రంగా చర్చించకుండా నగదురహిత వైద్యం చందాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తామని యుయస్పీసి స్పష్టం చేసింది. ఉద్యోగుల నగదురహిత వైద్యం అమలు పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని యుయస్పీసి డిమాండ్ చేసింది.