Site icon NTV Telugu

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఆగిపోతుందనుకుంటే.. వాటి తీవ్రత మరింత పెరిగింది.. సీఎం కేసీఆర్‌ ఎంట్రీతో హీట్ మరింత పెరిగింది.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇలా.. అన్ని విషయాలను తూర్పారబడుతున్నారు సీఎం కేసీఆర్.. అయితే, బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌ బెదిరింపులకు బీజేపీ భయపడదన్న ఆయన.. తెలంగాణలో 26,641 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బియ్యం సేకరణ చేస్తున్నామని వెల్లడించారు.. పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే అత్యధికంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందని తెలిపిన కిషన్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

600 లక్షల మెట్రిక్ టన్నులు దేశమంతా సేకరిస్తే, తెలంగాణ నుంచి అత్యధికంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం సేకరిస్తుందని తెలిపారు కిషన్‌రెడ్డి… ముడి బియ్యం తీసుకోవడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం కూడా లేదన్న ఆయన.. ఉప్పుడు బియ్యం ఎవరు తినరు అన్నారు.. రైస్ మిల్లర్లతో మాట్లాడి యంత్రాలను మార్చి ముడి బియ్యంగా మార్చాలని సూచించారు కిషన్‌రెడ్డి. కాగా, వరి ధాన్యం కొనుగోళ్ల విషయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలకు దారి తీస్తోంది.. కేంద్రంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటించిన కేసీఆర్.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version