Site icon NTV Telugu

Kishan Reddy: పీకేని కేసీఆర్‌ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!

Kishan Reddy

Kishan Reddy

సీఎం కేసీఆర్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, అన్నాడీఎంకే కూడా జాతీయ పార్టీలే.. దేశంలో పార్టీలు రావడం, పోవడం కొత్త కాదు అన్నారు. ఒక్క సీటు లేని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయన్న ఆయన.. ఎవరు ఏందో వచ్చే ఎన్నికల్లో తేలుతుందన్నారు. ఇక, ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) కూడా టీఆర్ఎస్‌ పార్టీ గెలవదు అని పెట్టే బేడ సర్దుకుని పోయాడట అని వ్యాఖ్యానించారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనని తిట్టి పంపించాడని పీకే తన స్నేహితులకు చెప్పుకున్నారని తెలిపారు కిషన్‌రెడ్డి.. దేశంలో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపించిన ఆయన.. కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారు.. కేసీఆర్‌ ప్రధాని అయినట్టు, ఆయన కూతురు ముఖ్య శాఖ నిర్వహిస్తున్నట్టు, కేటీఆర్ సీఎం అయినట్టు, ఆ కుటుంబం పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.

Read Also: Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్‌ ఎప్పుడంటే..?

ఉత్తర కుమార మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్‌రెడ్డి.. దేశంలో ఏ పార్టీ కూడా ఆయనతో కలిసి రావడం లేదన్నారు.. కేసీఆర్‌ను కలిసిన నేతలు కూడా ఆ మాటలు మేము అన లేదు అని వివరణ ఇచ్చుకుంటున్నారు.. జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉందన్నారు.. మజ్లిస్ పార్టీ కోసమే కేసీఆర్‌ పార్టీ పెడుతున్నారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారన్న ఆయన.. టీఆర్ఎస్‌కి మిగిలిన ఏకైక రాజకీయ మిత్ర పక్షం ఎంఐఎం మాత్రమే అన్నారు.. నెగెటివ్ అటిట్యూడ్‌ తో పెట్టిన ఏ పార్టీ బతికి బట్ట కట్టలేదన్నారు. వైఫల్యాల నుండి చర్చ మరల్చేందుకు కేసీఆర్‌ పార్టీ పెడుతున్నారని విమర్శించారు.. దేశంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించడం కోసం జాతీయ పార్టీ పెడుతున్నారని మండిపడ్డ ఆయన.. కేసీఆర్‌ కింద భూమి తెలంగాణలో కదులుతుంది.. అయన మాత్రం ఆకాశానికి ఎగురాలని అనుకుంటున్నాడని సెటైర్లు వేశారు.

కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు కలలో కూడా సీబీఐ, ఈడీ, ఐటీలే కనిపిస్తున్నాయన్నారు కిషన్‌రెడ్డి.. అయన కుటుంబంపై గ్రామాల్లో కథల కథలుగా చేపుకుంటునారని.. కేసీఆర్‌ తొండి ఆట ఆడుతున్నారన్నారు.. తెలంగాణలో నిజం, ధర్మం గెలుస్తుంది.. తెలంగాణ అమరవీరులు కేసీఆర్‌ కుటుంబం కోసం ఆత్మహత్యలు చేసుకోలేదు… ఫామ్‌హౌస్‌ పాలన తెలంగాణలో పోవడం ఖాయం అన్నారు.. ఇక, మునుగోడు ఎన్నికకు బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు కిషన్‌రెడ్డి.. మునుగోడులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది..మునుగోడు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతించిన ఆయన.. మోటార్లకు మీటర్ల ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version