Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెడతాం: జూపల్లి
  • కాళేశ్వరం వల్లే రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం: మంత్రి విమర్శలు
  • మహారాష్ట్రతో చర్చించి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
  • బీజేపీ ఎంపీలు ప్రధాని వద్ద ప్రాజెక్టు అంశం ప్రస్తావించాలి
Jupally

Jupally

upally Krishna Rao : కొమురం భీం జిల్లా పర్యటనలో ఉన్న ఎక్సైజ్ , పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి రంగంలో గ్రావిటీ ద్వారా నీటిని అందించే గొప్ప అవకాశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని ఆయన విమర్శించారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ, “2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. డా. బీఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు (తుమ్మిడిహెట్టి బరాజ్) భూమిపూజ చేశారు. రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. 106 కిలోమీటర్ల కాలువ పనులకు గానూ ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయ్యి, 46 కిలోమీటర్ల మేర పనులు కూడా జరిగాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆర్థిక భారం మోపింది” అని మండిపడ్డారు.

గ్రావిటీ (సహజ సిద్ధమైన ప్రవాహం) ద్వారా వెళ్లాల్సిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడం వల్ల అంచనా వ్యయం గణనీయంగా పెరిగిందని మంత్రి వివరించారు. దీనివల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడటమే కాకుండా, కరెంట్ బిల్లులు కూడా భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నది తలాపునే ఉన్న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రస్తుతం ఆ నీటిని వినియోగించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృత నిశ్చయంతో ఉందని జూపల్లి తెలిపారు. “150 మీటర్ల బరాజ్ నిర్మాణానికి అంగీకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. దీనివల్ల మహారాష్ట్రలోని శివిని గ్రామానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదు. భూములు నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కృషి చేయాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, వికసిత్ భారత్ అని చెప్పుకునే కేంద్రం ఈ ప్రాజెక్టు విషయంలో పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క యూనిట్ కరెంటు కూడా ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలించే ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తామని, ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు మానుకుని సహకరించాలని మంత్రి జూపల్లి కోరారు.