Special Bus for Men: ఇది నా సీటు అంటూ ధైర్యంగా కూర్చుని ప్రయాణం చేసే రోజులు మగవారికి వచ్చేశాయి. ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వ ‘మహాలక్ష్మి పథకం’లో భాగంగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించిన విషయం తెలసిందే. అయితే దీని వల్ల మగవారికి సీట్లు లేకుండా పోయాయి. ఎంత దూరమైన నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాగా..ఇప్పుడు పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘పురుషులు మాత్రమే’ అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. దీంతో మగవాళ్ళు మనకు కూడా స్వాతంత్య్రం వచ్చిందని ఎగిరి గంతేస్తున్నారు. హమ్మయ్య పురుషులకు కూడా సీట్లు దొరికి కూర్చునే రోజులు వచ్చేశాయంటూ.. లేచింది పురుష ప్రపంచం అంటూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Vetrimaaran: ఆయన సినిమాలకి ఆ రేంజ్ రెస్పాన్స్ మాములే సార్…
కాగా.. ‘మహాలక్ష్మి పథకం’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దేనికైనా తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఎన్నడూ లేనంతగా రద్దీ పెరిగింది. గతంలో రోజుకు 12-14 లక్షల మంది మహిళా ప్రయాణికులు రాగా, ప్రస్తుతం వారి సంఖ్య 30 లక్షలకుపైగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలో మహిళా ప్రయాణికులు కూర్చుంటున్నారు. దీంతో.. పురుషులు తమకు కేటాయించిన సీట్ల నుండి లేవాలని మహిళలకు చెప్పలేక ఎంతదూరమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది పురుషుల సీటు అని ఒకవేళ అడిగినా.. గొడవలకు దారితీస్తోంది. దీంతో తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులు నడపాలని పలువురు మగవారు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు మగ ప్రయాణికులు వీడియోలు తీసి ఆర్టీసీ అధికారులకు వినతులు పంపుతున్నారు.
Read also: Budget 2024 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం
ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం- ఎల్‌బీ నగర్ రూట్‌లో ఓ ఆర్టీసీ బస్సు ‘పురుషులకు మాత్రమే’ అనే బోర్డుతో కనిపించింది. గతంలో ఆర్టీసీ బస్సులు ‘మహిళలకు మాత్రమే’ అనే బోర్డు పెట్టేవి. ఇప్పుడు `పురుషులు మాత్రమే` అని చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని పురుషుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని వారు ఆనందంగా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. పురుషులకు కూడా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది నా సీటు అంటూ ఓ వ్యక్తి ధైర్యంగా కూర్చుని ప్రయాణించే రోజులు వచ్చాయి’ అని ఆ ఫోటో చెబుతోందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ రూట్‌లో మాత్రమే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారా.. లేక అన్ని రూట్లలో తిరుగుతున్నారా.. అనేది తెలియాల్సి ఉంది.
IND vs ENG: విశాఖలో రోహిత్ శర్మ రికార్డులు అదుర్స్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలే!