వీసీ సజ్జనార్.. గతంలో పోలీస్ అధికారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఆర్టీసీ రథసారథిగా బాధ్యతలు చేపట్టాక ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆర్టీసీలో కూడా సమూల మార్పులు తీసుకుని వచ్చేందుకు, ఆర్టీసిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సజ్జనార్ ఖమ్మంలో ఆర్టీసి బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖి చేస్తే.. ఆయన వద్ద కు వచ్చి సెల్పీ ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. అంటే ఆర్లీసీలో కూడా ఆయన మార్క్ ప్రయాణికుల వద్ద కనిపిస్తోంది. ఆర్టీసీ ఎండీ అయిన తరువాత మొదటి సారి ఖమ్మం విచ్చేశారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను కూడా తనిఖీలు చేశారు.
అనంతరం ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చి అక్కడ వున్న సమస్యలు, ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఇంకా చేయాల్సినవి ఏం ఉన్నాయి, అదే విధంగా ఆర్టీసీ బస్సులలో ఎటువంటి సౌకర్యాలను కల్పించాలో ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నారు. సామాన్యులు ఎక్కే ప్యాసింజర్ బస్ ను ఎక్కి బసులో ఉన్న ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. బస్ లో అటు నుంచి ఇటు వైపు తిరిగారు.
అంతే కాదు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్నంత సేపు ఆయనతో సెల్పీ లు దిగేందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపించారు. ఓపికతో వారితో కలసి వారి వద్ద నుంచి ఆర్టీసి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు. చివరకు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సైతం సజ్జనార్ తో సెల్పీలు దిగారు. దాదాపుగా మూడుగా గంటల పాటు ఆర్టీసీ బస్ స్టేషన్ లో సజ్జనార్ గడిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అదే విధంగా సిబ్బంది వద్ద నుంచి ఆర్టీసీ మెరుగుదల కోసం సలహాలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఆర్టీసీ అందరిదీ, ఆర్టీసీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని, అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు సజ్జనార్. ఆర్టీసీ గతంలో కన్న మెరుగైన సేవలను అందిస్తున్నదని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన వుందని సజ్జనార్ అన్నారు.