తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు జూన్ 13న పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ (2022-23) విడుదలైంది. ఈ విద్యాసంవత్సరం 230 పని దినాలు ఉండనున్నాయి. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరం 4 ఏప్రిల్ 2023న ముగియనుంది. వచ్చే ఏడాది మార్చిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
25 ఏప్రిల్ 2023 నుంచి 11 జూన్ 2023 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. పదవ తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్ 10 జనవరి 2023 వరకు పూర్తి కావాలని అకాడమిక్ క్యాలెండర్ ద్వారా ప్రకటించారు. ఎస్సెస్సీ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రారంభించే ముందు రివిజన్ క్లాసులు, ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతులకు సంబంధించిన సిలబస్ 28 ఫిబ్రవరి 2023 వరకు పూర్తి కావాలని అధికారులు క్యాలెండర్లో వెల్లడించారు. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9 వరకు 14 రోజులు దసరా సెలవులు. దీనితో పాటు.. జనవరి 13 నుండి జనవరి 17 వరకు పాఠశాలలకు ఐదు రోజులు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించారు. పాఠశాల అసెంబ్లీలో యోగా, ధ్యానం ప్రతిరోజూ నిర్వహించబడతాయి. తరగతి గదిలో అసెంబ్లీ తర్వాత వీటి కోసం 5 నిమిషాలు కేటాయించాలి.