తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు అమ్ముకుంటున్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కొందరయితే పానీపురీ వ్యాపారం చేస్తున్నారు. కొంత మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి వయస్సు పరిమితి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగులకు కెసిఆర్ భారీ బొనాంజా ప్రకటించనున్నారు. లక్షకు పైగా పైగా ఉద్యోగ నియామకాలు చేపడతారని, తక్షణం నియామక ప్రక్రియ వుంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు మళ్లీ Dsc పునరుద్దరణ చేయనున్నారు. Dsc ద్వారానే మెజారిటీ నియామకాలు జరపనున్నారు. స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు లభిస్తాయి. తొలిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి అర్హులకు నిరుద్యోగ భృతి అందిస్తారని అంటున్నారు.