తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు ఇంటిపై నల్ల జెండా ఎగరవేశాయి టీఆర్ఎస్ శ్రేణులు. సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి పైన నల్ల జెండా ఎగరవేశారు రైతులు.
నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను ఎగురవేసి నిరసనను వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యకులు మధు సూధన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ముంబై జాతీయ రహదారి పై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగుల బెట్టారు.
ఖమ్మం జిల్లా మధిర (మం) రాయపట్నంలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనందుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ లో నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్యకర్తలు, రైతుల ఇళ్లపై నల్లజెండాల నిరసన కొనసాగుతోంది.
https://ntvtelugu.com/gap-between-ts-govt-and-governor-tamilisai/
