NTV Telugu Site icon

Munugode bypoll: అది జరిగితేనే బీఆర్‌ఎస్‌.. లేకపోతే టీఆర్ఎస్సే..!

Munugode Bypoll

Munugode Bypoll

త్వరలోనే నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అధికార టీఆర్ఎస్‌ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీ.. భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరుతో బరిలోకి దిగుతుందా? లేక టీఆర్ఎస్‌ పార్టీ పేరుతోనే పోటీ చేస్తుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. నిన్నటి నిన్ననే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేశారు.. ఆ తీర్మానం కాపీ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది.. ఈ తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత బి.వినోద్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి వెళ్లి బీఆర్‌ఎస్‌ పేరు తీర్మానాన్ని సీఈసీకి అందజేసింది. దానికి ఆమోదం తెలపాల్సిందిగా కోరింది. అయితే, రేపే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ కానుంది.. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఈలోగానే బీఆర్ఎస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

Read Also: KCR Delhi Visit: బీఆర్‌ఎస్‌ చీఫ్‌గా తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. విషయం ఇదేనా..?

ఇక, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బృందానికి నేతృత్వం వహించిన మంఆజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీగానే పోటీ చేసే అవకాశం ఉందనే వ్యాఖ్యలు చేశారు.. త్వరితగతిన అంటే.. ఈ నెల 14వ తేదీ లోగా పార్టీ పేరును “భారత్‌ రాష్ట్ర సమితి” ( బీఆర్ఎస్)గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే.. బీఆర్ఎస్‌ పేరుతో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు.. “ప్రజా ప్రతినిద్య చట్టం” లోని 29ఏ సెక్షన్ లోని సబ్ క్లాస్ 9 ప్రకారం పార్టీ పేరును మార్చాలని కోరుతూ దరాఖాస్తు ఇచ్చామని వివరించారు.. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వేరే ఎవ్వరూ కొత్త పార్టీ నమోదు చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు వినోద్‌ కుమార్‌.. అంటే.. ఇప్పుడు మునుగోడు బై పోల్‌లో టీఆర్ఎస్‌గా పోటీ చేయాలా? బీఆర్ఎస్‌గా బరిలోకి దిగాలా? అనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంది. మరి, సీఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.. అయితే, చివరి నిమిషంలో ఈసీ పచ్చజెండా ఊపినా.. టీఆర్ఎస్‌కు నష్టం మాత్రం లేదనే చెప్పాలి.. ఎందుకంటే.. ఎన్నికల గుర్తం మాత్రం ‘కారు’ కొనసాగనుండడం ఆ పార్టీ కలిసి వచ్చే అవకాశమే..

కాగా, మునుగోడులో నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. 7 నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. 15న నామినేషన్ల పరిశీలన, 17వ తేదీ వరకు నానినేషన్ల ఉపసంహరణ.. నవంబర్‌ 3వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్‌.. నవంబర్‌ 6వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటకించనున్నారు.. అయితే, ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నికలు రాగా.. ఈసారి కోమటిరెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.. ఇక, కాంగ్రెస్‌ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేస్తున్నారు.. నువ్వా నేనా అన్నట్టుగా.. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ పేరును కూడా ప్రకటించారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించేందుకు కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారు. మరి.. బీఆర్ఎస్‌కు ఈసీ ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది అనేది వేచిచూడాల్సిన అంశమే.