NTV Telugu Site icon

Jagga Reddy: టీఆర్ఎస్‌, బీజేపీది మైండ్‌ గేమ్‌.. 12 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్‌కి గిఫ్ట్‌ ఇవ్వాలి..

టీఆర్ఎస్‌, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్‌ఎస్‌-బీజేపీ ప్లాన్‌ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్‌ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణకి పూర్తి సమయం ఇస్తామని రాహుల్‌ గాంధదీ తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదన్నారు జగ్గారెడ్డి.

Read Also: Jagga Reddy: పోలీసులపై దండ యాత్ర.. రేపు ఖమ్మం వెళ్తున్నాం-జగ్గారెడ్డి

రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు జగ్గారెడ్డి.. వరికి గిట్టుబాటు ధర లేదు.. వరి వేయొద్దు అని కేసీఆరే అనడం 40 శాతం వరి వేయలేదని.. ఈ విషయంలోనూ బీజేపీ-టీఆర్ఎస్‌ దాగుడు మూతల ఆట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, బండి సంజయ్ పనికి మాలిన మాటలు మాట్లాడతారు.. కేసీఆర్‌ తియ్యటి మాటలు చెబుతారు.. ఇద్దరితో రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి.. వరి వేయని రైతుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. ఆ రైతుల పొట్ట కొట్టింది టీఆర్ఎస్‌-బీజేపీయే అని ఆరోపించారు.. బండి సంజయ్ కి తు.. తెలియదు..తా తెలియదని సెటైర్లు వేసిన జగ్గారెడ్డి.. టీవీలను పిలిచి భౌభౌ అని అరుస్తారని.. రాజకీయం చేసేది అంతా సెంట్రల్ బీజేపీయే అన్నారు.. బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినా పరవాలేదు.. కానీ, కాంగ్రెస్ రావద్దని కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరోవైపు, వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు రైతులు, నిరుద్యోగులు అంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ బలోపేతం అవుతుందని.. ఐదు లక్షల మందితో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామన్నారు.. ఇక, తెలంగాణ నుండి 12 ఎంపీ సీట్లను గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.