NTV Telugu Site icon

Travels Fraud: పరిమితికి మించి ప్రయాణికులు.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు

Pvt Bus

Pvt Bus

ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు.

దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర 2500 కాగా అదనంగా 3వేలు తీసుకున్నారని ప్రయాణికులు ఆరోపించారు. ఒకరి దగ్గరనుండి దాదాపు 5-6 వేల రూపాయలు బెదిరించి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో 150 మంది వరకూ ఎక్కించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అధికారులకు చిక్కింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను బస్ డిపో కు తరలించారు.

దీంతో ప్రయాణికులు అంతా ఆసిఫాబాద్ డిపో కి చేరుకొని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు డ్రైవర్ తమపై చేయి చేసుకుని దుర్భాషలాడారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తమ దగ్గర వెళ్లేందుకు డబ్బులు కూడా లేవని అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా టికెట్ కొనుగోలు చేశామని తెలిపారు బాధితులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఆగడాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. తమను గమ్యస్థానాలకు చేర్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.