Group-2: హైదరాబాద్‌లో గ్రూప్-2 విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతో అశోక్‌నగర్‌లో మర్రి ప్రవళిక (23) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది.
వరంగల్ జిల్లా బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం గదికి వచ్చిన తోటి విద్యార్థులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలిసి అప్పటికే పెద్ద సంఖ్యలో గ్రూప్ 2 అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. పరీక్ష వాయిదా పడినందుకు మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మృతదేహం అర్ధరాత్రి వరకు హాస్టల్‌లోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు బండారు విజయలక్ష్మి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని అభ్యర్థులతో కలిసి నిరసన తెలిపారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని గ్రూపులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అభ్యర్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు ససేమిరా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వారి నిరసనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రిమ్స్, సిట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్ చిక్కడపల్లి ఏసీబీ యాదగిరి సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రత్నం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేయడంతో ఆగ్రహించిన అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అర్ధరాత్రి అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగారు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. శనివారం ఉదయం ప్రవళిక మృతదేహాన్ని బిక్కాజిపల్లికి తరలించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.