Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏపీ రైతులకు శుభవార్త.. అతి త్వరలోనే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖ‌ప‌ట్నంలోని గంగ‌వ‌రం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి కానుంది.

కర్ణాటకలో దారుణం.. వాష్ రూమ్ లో బిడ్డను కన్న బాలిక

కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్‌ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పాఠశాల వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుుడు శశిధర్ కోసాంబే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగుతుంటే పాఠశాల సిబ్బంది ఏం చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే దీనిపై నివేధిక పంపాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురాలేదని పేర్కొంటూ, పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిపై సుమోటోగా ఫిర్యాదు నమోదు చేస్తామని కోసాంబే తెలిపారు.

రోజా అయినా, బైరెడ్డి అయినా.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు!

గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ‘ఆడుదాం ఆంధ్రా’ని రాజకీయంగా వాడుకున్నారని, నిధుల దుర్వినియోగం భారిగా చేశారని ఏపీ శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గతంలో రూ.280 కోట్లు నిధులతో పారా అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ కూటమి ప్రభుత్వం వాటి కోసం కృషి చేస్తుందన్నారు. ఆడుదాం ఆంధ్రా విజిలెన్స్ పూర్తి అయిందని, ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్దం అని తెలిపారు. తప్పు చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రవి నాయుడు హెచ్చరించారు.

జగిత్యాలలో వరద బీభత్సం.. స్థంభంపల్లి పెద్ద చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జగిత్యాల జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లి గ్రామాలపై విరుచుకుపడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రహదారులు దెబ్బతినగా, చిన్న చిన్న కాలువలు కూడా నదుల్లా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొత్తం జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రత్యేకంగా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం (ఆగస్టు 27) రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి మట్టం వేగంగా పెరగడంతో మత్తడి దూకే స్థాయికి చేరుకుంది.

ఉల్లి రైతును ఆదుకునేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతును ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున ఉల్లిని కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని.. ఉల్లిని ఆరబెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు.

పైకప్పు నుంచి పిల్లాడిని కిందకి విసిరేసిన తల్లి.. తరువాత ఏమైందంటే..

ఈ మధ్య కొందరు మనుషులు రీల్స్ కోసమో తెలీదు. వేరే ఇంకోటి ఏంటో తెలియదు కానీ.. వైరల్ అయ్యేందుకు అడ్డమైన పనులు చేస్తున్నారు. వీటి వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న పిల్లవాడిని ఇంటి పైకప్పు నుంచి కిందకు విసిరేస్తుసిన వీడియో.. అందరిని ఒకింత.. ఆశ్చర్యానికి, భయానికి గురిచేసింది. ఇది ఏదైనా ఆచారంలో భాగమా లేదా ఆ మహిళ సరదా కోసం ఈ ప్రమాదకరమైన చర్య చేసిందా .. లేక రీల్స్ కోసం చేసిందా అనే విషయం తెలిలేదు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా షాక్ అవుతారు.

17 ఏళ్ల కుమార్తెను చంపిన తండ్రి.. భర్తను పట్టించిన భార్య..

17 ఏళ్ల కుమార్తెను కన్న తండ్రి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తర్వాత ఆ తండ్రి పథకం ప్రకారం.. తన కుమార్తెది హత్య కాదు, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇది మాత్రమే కాకుండా హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు బూడిదను కూడా నదిలో కలిపేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే వాళ్లు విచారణ ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తండ్రి బిడ్డను చంపితే తల్లి చెప్పిన నిజం చెప్పి తన భర్తను అరెస్ట్ చేయించింది. ఇంతకీ అసలు కథ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. అశోక్ నగర్ జిల్లాలోని బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గీలారోపా గ్రామానికి చెందిన గుర్నీత్ (17) ను ఆమె తండ్రి బలిహర్ సింగ్ గొంతు కోసి చంపాడు. ఈసందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. హత్య తర్వాత నిందితుడు కేసును ఆత్మహత్యగా చూపించడానికి మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి, ఆపై హడావిడిగా దహనం చేశాడని చెప్పారు. గుర్నీత్ తనకు నచ్చిన వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆమె నిర్ణయాన్ని తన తండ్రి వ్యతిరేకించాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఈ విషయంలో తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చియి. గుర్నీత్ హత్యకు 12 రోజుల ముందు వాళ్ల ఇంట్లో గొడవ జరిగింది.

వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.. కోమటిరెడ్డి అత్యవసర నిర్ణయం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల (R&B) శాఖకు చెందిన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు. అధికారులను అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మంత్రి కోమటిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు నష్టానికి సంబంధించిన తాజా నివేదికను సమర్పించారు. రాష్ట్రంలోని మొత్తం 37 ఆర్ అండ్ బి డివిజన్లలో 1039 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈ నష్టంలో 794 వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 31 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోగా, 356 ప్రాంతాల్లో రోడ్లపై నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతోంది. దీంతో ఇప్పటివరకు 3035 చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి.

చట్టపరంగా విడాకులు సాధించిన తొలి హిందూ మహిళ ఎవరంటే?

భారత చరిత్రలో మహిళల హక్కుల కోసం మొట్టమొదటగా చట్టపరమైన పోరాటం చేసిన వ్యక్తిగా రుఖ్మాబాయి రౌత్ చరిత్రలో నిలిచారు. 1885లో ఆమె కేసు దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచించింది. ఆ తర్వాత కాలంలో 1891లో వయస్సు పరిమితి చట్టం (Age of Consent Act) ఆమోదానికి దారితీసింది. ఈ కేసుతో చిన్న వయసులో వివాహం అనే సంప్రదాయాన్ని చట్టపరంగా రద్దు చేసే మార్గం సుగమమైంది.

రుఖ్మాబాయి భీమ్రావ్ రౌత్ 1864 నవంబర్ 22న ముంబైలో జన్మించారు. ఆమె తల్లి కూడా చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది. తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో, ఆమె తల్లి డా. సఖారామ్ అర్జున్ రౌత్‌ను తిరిగి వివాహం చేసుకున్నారు. ఆయన మద్దతుతో రుఖ్మాబాయి విద్యలో ఆసక్తి పెంచుకుని, మహిళా హక్కుల కోసం పోరాడే ఆత్మవిశ్వాసం పొందారు. అయితే, సంప్రదాయాల ప్రకారం రుఖ్మాబాయి కేవలం 11 ఏళ్ల వయసులో 19 ఏళ్ల దాదాజీ భికాజీతో వివాహం జరిగింది. కానీ, ఆమె తన సవతి తండ్రి సహకారంతో ఇంట్లోనే ఉండి చదువును కొనసాగించారు.

క్రీడా ప్రపంచానికి హైద‌రాబాద్ వేదిక కావాలి…

ఖేలో ఇండియా, కామ‌న్ వెల్త్‌, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వ‌హించినా వాటిలో తెలంగాణ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వ‌హ‌ణ‌, వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌డం, కోచ్‌లు, ట్రైన‌ర్‌ల‌కు శిక్ష‌ణ‌, క్రీడా పాల‌సీలో వివిధ అంశాల‌పై ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌, అమ‌లుకు స‌బ్ క‌మిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ బోర్డు మొద‌టి స‌మావేశం హైద‌రాబాద్‌లో గురువారం జ‌రిగింది. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత రెడ్డి మాట్లాడుతూ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడ‌ల ప్రోత్సాహం విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ హైద‌రాబాద్ గురించి మాట్లాడుకోవాల‌నేదే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. క్రీడా ప్ర‌పంచానికి హైద‌రాబాద్ వేదిక‌గా మారాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ‌కు ఐటీ సంస్కృతి ఉంద‌ని… రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం త‌మ పిల్ల‌లు ఐటీ రంగంలో ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని… అలానే క్రీడా సంస్కృతి రావాల‌ని తాను అభిల‌షిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గ‌తంతో పోల్చితే 16 రెట్లు బ‌డ్జెట్ పెంచామ‌ని సీఎం వివ‌రించారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారుల‌కు ప్రోత్సాహాకాలు ఇవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించామ‌ని సీఎం తెలిపారు. క్రీడా రంగం ప్రాధాన్య‌త‌ను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామ‌న్నారు.

 

Exit mobile version