జస్టిస్ వర్మను తొలగించాలని ఎంపీలు సంతకాలు.. స్పీకర్‌కు సమర్పణ
నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి. అట్టపెట్టెల్లో భారీగా నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫైర్ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పైఅధికారులకు పంపించారు. ఆ ఫొటోలను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నాకు పంపించారు. దీంతో ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అనంతరం దర్యాప్తునకు ఆదేశించగా.. ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు వర్మకు సంబంధించినవిగా కమిటీ తేల్చింది.
రానా, దేవరకొండ, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు
ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నలుగురు సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మీ ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ఈ యాప్‌లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతోంది. మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది. ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి. తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది.
గుడ్‌న్యూస్.. జీవో 49 నిలుపుదల.. సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల జీవో 49ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయం పై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జీవోను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలును నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కన్జర్వేషన్ కారిడార్ వల్ల తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆదివాసీ సంఘాలు ఇటీవల పెద్దఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ అంశంపై మరిన్ని చర్చలు జరిపి, ప్రజల అనుమానాలను నివృత్తి చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హరి హర వీరమల్లు ఈవెంట్ వద్ద ఫ్యాన్స్ హంగామా!
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రులతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి హాజరు కాబోతున్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు బ్రహ్మానందం ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. గతంలో సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో పోలీసులు శిల్పకళా వేదికలోని సీటింగ్ కెపాసిటీలో సగానికంటే తక్కువ మందికి మాత్రమే లోపలికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. 1000 మందికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అయితే, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శిల్పకళా వేదిక వద్ద వారి కోలాహలం కనిపిస్తోంది.
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడకూడదని హెచ్చరించారు. అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ముంబైలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసుండాలని వివాహాలు జరిపిస్తుంటే.. మధ్యలోనే కుప్పకూల్చుకుంటున్నారు. క్షణిక సుఖకోసం భాగస్వాములను అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రియుడితో సుఖం కోసం కోసం కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మరో ఘోరం వెలుగుచూసింది. అచ్చం ‘దృశ్యం’ సినిమా మాదిరిగా జరిగినట్లుగానే జరిగింది. విజయ్ చవాన్(35), కోమల్(28) భార్యాభర్తలు. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలసోపారా తూర్పులోని గడ్గపడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 15 రోజులుగా విజయ్ చవాన్ కనిపించడం లేదు. అయితే పొరుగింటి యువకుడితో కోమల్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ప్రియుడితో సుఖం కోసం భర్త అడ్డొస్తున్నాడని విజయ్ చవాన్‌ను చంపేసింది. అనంతరం శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టి టైల్స్‌తో మూసేసింది.
గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక పాలసీపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో గిగ్ వర్కర్ల (Gig Workers) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు అందించే విధంగా పాలసీ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.అధికారుల నుంచి పాలసీ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం పైన దృష్టి పెట్టాలని సూచించారు. ఆ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన పూర్తి డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి పారదర్శకతను కాపాడాలని, వారికి అవసరమైన సహాయాలు సకాలంలో చేరే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కావాలి అని ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళ లకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలి.. టికెట్ పై ఇస్తున్న రాయితీ టికెట్ పై ఉండాలి.. మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వివరాలతో టిక్కెట్ల జారీ.. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి-చార్జింగ్ స్టేషన్లతోనే స్వయం సమృద్ధి ఉంటుందని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
నైజాం ఫాన్స్ గెట్ రెడీ.. ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది !
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత రత్నం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పర్మిషన్ వచ్చేసింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్స్ సహా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జీవో జారీ అయింది. జీవో లెక్కల ప్రకారం ముందు రోజు 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ వేసుకోవచ్చు. దానికి 600 ప్లస్ జీఎస్టీ మొత్తం కలిపి 708 రూపాయలు టికెట్ రేట్‌గా ఫిక్స్ చేశారు. ఇక తర్వాత ప్రతి రోజు ఉండే నాలుగు షోలతో పాటు ఒక షో అదనంగా వేసుకోవచ్చని మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు 150 రూపాయలు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించారు. ఇక 28 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లో కూడా 150 రూపాయలు పెంచే అవకాశం కల్పించారు.
జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు.. అచ్యుతానందన్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన మోడీ
కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్.అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతానందన్ జీవితమంతా ప్రజా సేవకే అంకితం అయిపోయిందని.. కేరళ పురోగతికి జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు జరిగిన సంభాషణలను మోడీ గుర్తుచేశారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మద్దతుదారుల పట్ల మోడీ విచారం వ్యక్తం చేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్.అచ్చుతానందన్ (101) సోమవారం తుదిశ్వాస విడిచారు. తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.