ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం, జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ అనూహ్యంగా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. జూలై 2న బర్మింగ్‌హామ్‌లో ఆరంభం అయ్యే రెండో టెస్టులో కఠిన సవాలును టీమిండియా ఎదుర్కోబోతోంది. రెండో టెస్టులో గెలవడం గిల్ సేనకు ఎంతో కీలకం. ఈ కీలక టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. కొన్నేళ్లుగా జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై ఎక్కువ భారం పడకుండా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అర్ష్‌దీప్ ఇంకా టెస్టు అరంగేట్రం చేయని విషయం తెలిసిందే. అర్ష్‌దీప్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది.
నేడు మూడు జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మూడు జిల్లాల్లో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు బయలుదేరి చంద్రబాబు, సాయంత్రం 3 గంటలకు ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పై ఆయన దృష్టి సారించారు.
నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథ యాత్ర మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక, లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంటరాగా జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. ఆలయ పరిసరాలన్నీ ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేశారు. అయితే, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. ఈసారి ఏకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు 10 వేల మంది జవాన్లను సర్కార్ నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘా ఉంచినట్లు ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా వెల్లడించారు. అలాగే, భద్రతతో పాటు వైద్య సేవలకూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసింది. ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్‌లు, 265 ప్రత్యేక ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉండనున్నారు. ఏఐఎమ్ఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈసారి పూరీలోని రథయాత్ర వద్ద విధులు నిర్వహించనున్నారు. యాత్రను భద్రంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
వారిపై కఠిన చర్యలు తప్పవు.. నకిలీ ఈ-స్టాంపులపై మంత్రి సీరియస్..!
రాష్ట్రంలో వెలుగు చుసిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ-స్టాంపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీలతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశం నిర్వహించారు. నకిలీ ఈ-స్టాంపుల సృష్టి మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్టాంపుల జారీ ప్రక్రియను పూర్తిగా పరిశీలించి, లోపాలను తేల్చాలని అధికారులను ఆదేశించారు. నకిలీ ఈ-స్టాంపులను ఎవరు తయారు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ చర్యలతో భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
జులై 10న రాష్ట్ర కేబినెట్.. ముందస్తుగా మంత్రులకు సమాచారం
సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, తదుపరి సమావేశం జులై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతోపాటు, ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 98 కేబినెట్ భేటీలు నిర్వహించగా, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 18 సమావేశాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాలనా నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు, వాటి అమలు పై సమీక్ష నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిరంతరంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు కేబినెట్ ఎజెండా, టేబుల్ ఐటమ్స్ వంటి సమాచారం మంత్రులకు హార్డ్‌కాపీల రూపంలో అందించగా, ఇకపై ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిపాలన విభాగం నిర్వహించే ఈ ఫైళ్లన్నీ ఇకపై ఈ-ఫైలింగ్ విధానంలో భద్రపరచనున్నారు. రహస్యత, భద్రత పరంగా ఇది మెరుగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు తీసుకువస్తున్నారు.
భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరగబోతుంది.. ట్రంప్ కీలక ప్రకటన
భారత దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్’’లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో కీలక ఒప్పందం జరిగిందని.. త్వరలోనే భారతదేశంతో కూడా చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతుందని సూచనప్రాయంగా ట్రంప్ వెల్లడించారు. రెండు దేశాల బృందాలు నాలుగు రోజుల పాటు రహస్య చర్చలు జరిగాయని.. త్వరలోనే ప్రకటన రాబోతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని.. దానిలో భాగం కావాలని కోరుకుంటారని.. కానీ మేము ప్రతి దేశంతో ఒప్పందాలు చేసుకోమని ట్రంప్ తేల్చి చెప్పారు. కొంత మందికి చాలా ధన్యవాదాలు చెబుతూ లేఖలు కూడా పంపినట్లు చెప్పుకొచ్చారు. కొన్ని నెలల క్రితం పత్రికలు రకరకాలుగా రాశాయని.. మీతో ఒప్పందాలు చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించాయని.. కానీ నిన్ననే మేము చైనాతో సంతకం చేసినట్లు గుర్తుచేశారు. మాకు కొన్ని గొప్ప ఒప్పందాలు ఉన్నాయని.. త్వరలో ఒకటి రాబోతుందని.. బహుశా భారతదేశంతో అది చాలా పెద్దది అని ట్రంప్ పేర్కొన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ వారాంతం వరకు వర్షాలు మేల్కొలుపు గానుండనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూన్ 29వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుండ్రంగా ఏర్పడిన మేఘాలు, తీవ్రమైన వానల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశముందని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడవచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.
డ్రగ్స్ కేసులో పంజా సినిమా దర్శకుడి తమ్ముడుకి రిమాండ్
తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ వవ్యహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు. విచారణలో భాగంగా శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు కృష్ణను కూడా అరెస్ట్ చేసారు పోలీసులు. కృష్ణ తో పాటు డ్రగ్స్ డీలర్ కెవిన్ కు కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా జూలై పదవ తేది వరకు రిమాండ్ విధించింది కోర్డు. నటుడు కృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు. నటుడు కృష్ణ ఇంటిలో స్వాధీనం చేసుకున్న లాప్ టాప్, పాత సెల్ ఫోన్ లో అనేక మంది కాల్ ఉందని గుర్తించారు. ఆ కాల్ డేటా రికవరీ పై దృష్టి పెట్టారు పోలిసులు. కృష్ణకు తమిళ యువ దర్శకులు అత్యంత సన్నిహితంగా ఉండడంతో అదిశగా కూడా కాల్ డేటాను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఇటు టాలీవుడ్ లోనూ కృష్ణకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు నటుడు కృష్ణ మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ సోదరుడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమా దర్శకుడు విష్ణు వర్దన్ కు కృష్ణ స్వయానా తమ్ముడు. అన్నస్టార్ దర్శకుడు కావడంతో కోలీవుడ్ లో సులువుగా సినిమా అవకాశాలు పోందిన కృష్ణ. ఆ దశలోనే మత్తుకు అలవాటు పడి డ్రగ్స్ వాడుతు మరికొందరు నటులకు సరఫరా చేసాడు. రెండు రోజులగా పోలీసులు చేస్తున్న విచారణలో పలువురు నటుల సమాచారం ఇచ్చిడు నటుడు కృష్ణ. దాంతో త్వరలో మరికొందరు నటులను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది
డ్రమ్‌లో కుళ్ళిపోయిన మృతదేహం.. కొనసాగుతున్న పోలీసుల విచారణ
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఓ నీలి రంగు డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసుల ఆ డ్రమ్ లోపల ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఉన్న కుళ్ళిపోయిన మానవ మృతదేహం బయటపడింది. దీనిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుల్వంత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ శవాన్ని చూస్తుంటే వలస వచ్చిన వ్యక్తిగా తెలుస్తోంది.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సివిల్ హాస్పిటల్‌లోని మార్చురీకి పంపించాం.. శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవు.. పోస్ట్‌మార్టం తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు.
