Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

నాడు ఎన్టీఆర్, వైఎస్సార్.. నేడు వైఎస్‌ జగన్..

రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు.. ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దార పోసారో.. అలా.. నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు సీఎం వైఎస్ జగన్ బీసీల ఉన్నతికి పాటుపడుతున్నారని ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణాజిల్లా, గుడివాడలో నిర్వహించిన బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. బీసీ జెండా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పిట వేస్తుందని తెలిపారు. బీసీ సోదరులంతా ఏకతాటి పైకి వస్తే 50 శాతం రిజర్వేషన్లు సాధించవచ్చు అన్నారు.

రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే… కమిషనర్ సుధీర్ బాబు క్లారిటీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్‌ల కేసులు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

ప్రజా పాల‌న దరఖాస్తులు ఉర్దూ భాష‌లోనూ ఉండాలి.. ఎంఐఎం డిమాండ్‌

తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు హామీల్లో ఐదింటిని (యువ వికాసం మినహా) అమలు చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఐదు హామీలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుంచి ‘పబ్లిక్ గవర్నెన్స్’ పేరుతో స్వీకరించనున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్ నేడు సంబంధిత రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది. రేపటి నుంచి గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ ఉంచారు. ఆ ఐదు హామీల అమలుకు ప్రభుత్వ ప్రజాపరిపాలన దరఖాస్తుల స్వీకరణ కూడా ఉర్దూ భాషలోనే ఉండాలన్నారు.

కర్ణాటకలో భాషా వివాదం.. ఇంగ్లీష్ సైన్ బోర్డులను పగులకొట్టిన నిరసనకారులు

కర్ణాటకలో భాషపై వివాదం చెలరేగింది. బుధవారం పలు కన్నడ అనుకూల సంఘాలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించి ఆంగ్లంలో రాసి ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. అన్ని సంస్థలపై 60 శాతం సైన్ బోర్డులు కన్నడ భాషలో ఉండాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విశేషమేమిటంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కర్ణాటకలో నివసించే ప్రజలకు కన్నడ నేర్చుకోవాలని సూచించారు. రాజధాని బెంగళూరులో బుధవారం పలుచోట్ల గందరగోళం నెలకొంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, సెలూన్లు, స్పాలతో సహా నగరంలోని అనేక సంస్థలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అందులో నిరసనకారులు ఆంగ్లంలో వ్రాసిన సైన్ బోర్డులను ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కాలంలో అనేక ఇంగ్లీష్ సైన్ బోర్డులపై నలుపు రంగు పూయడం కనిపిస్తోంది.

సర్కార్ గుడ్ న్యూస్.. గ్రామ సభల తర్వాత కూడా దరఖాస్తు ఇవ్వొచ్చు..

గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యని అన్నారు. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తామని అన్నారు. పదేళ్లు ప్రభుత్వం – ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామన్నారు. గడిలా దగ్గరకు ప్రజలు రావడం కాదన్నారు.

ఇచ్చిన మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్.. ఉద్యోగాలు ఇస్తాం

జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైనిక స్కూల్ వరంగల్ నుండి ఎందుకు పోయిందో చెప్పమని అడగండి అన్నారు. బుల్లెట్ ట్రైన్ గురించి అడిగే వినోద్ రావు.. సైనిక స్కూల్ ఎందుకు తరలిపోయింది ఎందుకో చెప్పు? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఇస్తాం కొత్తవి అన్నారు. మేడిగడ్డ అన్నారం మీద విచారణ చేస్తున్నాం.. ముందుంది ముసళ్ళ పండగ.. అన్ని వసూలు చేస్తామన్నారు. అధికారిక సమాచారం వాళ్లకు ఇచ్చే వివరాలు కూడా ఉన్నాయన్నారు. మీదగ్గర ఉన్న వివరాలు కూడా ఇవ్వండి అని మీడియా మిత్రులకు రేవంత్ అన్నారు. అధికారం పోయిన విత్ డ్రాయల్ సింప్తం కేటీఆర్ దగ్గర కనిపిస్తోందన్నారు. మంచంకి కట్టేసే వైద్యం చేయించాల్సి వస్తుందని వ్యంగాస్త్రం వేశారు. టీఎస్పీఎస్ పై క్లారిటీ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే చైర్మన్ ఉండాలని.. కానీ.. అందరూ రాజీనామా చేశారని తెలిపారు. రాష్ట్రపతి అనుమతి గవర్నర్ కోరారని, వాటిని పరిశీలించి..చెప్తా అన్నారు. గందరగోళం కాకూడదని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

ఇండియా కూటమితో దేశ సమగ్రతకు ముప్పు

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతున్న సందర్భంలో.. దేశప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి కూటమి’ అహంకారాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి, సరైన బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు. సనాతన ధర్మానికి, హిందుత్వం, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని పనికిరాని కూటమి రోజురోజుకూ ప్రమాదంగా మారుతోందనే విషయాన్ని దేశప్రజలు గమనించాలన్నారు.

అంతేకాకుండా..’మొదట్నుంచీ అవకాశం దొరికినపుడల్లా భారతదేశ సమైక్యతను అస్తిరపరిచేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ ప్రయత్నంతో దేశ సమగ్రతపట్ల తనకున్న విద్వేషాన్ని బయటపెట్టుకుంది. ఇటీవలే కాంగ్రెస్ కూటమిలోని DMK పార్టీకి చెందిన ఓ నాయకుడు.. యూపీ, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడేవాళ్లు, తమిళనాడుకు టాయిలెట్లు కడిగేందుకు వస్తారని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం, ఆక్షేపణీయం.

రాణించిన రాహుల్.. 245 పరుగులకు టీమిండియా ఆలౌట్..

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేసి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కేఎల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ యాభై పరుగుల మార్కును తాకలేకపోయారు.

208/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఈరోజు 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 238 పరుగుల స్కోరుపై టీమిండియాకు తొలి దెబ్బ తగిలింది. 22 బంతుల్లో 5 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ వేసిన బంతికి మహ్మద్ సిరాజ్ ఔటయ్యాడు. ఆ తర్వాత.. కేఎల్ రాహుల్ నాంద్రే బెర్గర్ బంతికి పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ కు సౌతాఫ్రికా గడ్డపై ఇది రెండో సెంచరీ. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబాడ అద్భుత బౌలింగ్ చేశాడు. రబాడ 20 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. తొలి టెస్టు ఆడుతున్న నాండ్రే బెర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కో యూన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ తలో వికెట్ తీశారు.

ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ను జనసేనలోకి ఆహ్వానించిన పవన్

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులున్నాయి.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇక, విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారారు. ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ జనసేనలో చేరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉంది.. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుంది అనవ పవన్ పేర్కొన్నారు.

ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్‌లు కట్టారా

మెదక్ లోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యక్రమాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లు చెప్పారని, హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్ లు కట్టారా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. రైతు బీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటు అని హరీష్‌ రావు మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు అసెంబ్లీలో అన్ని జుటా మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టులో హీరో రజినీకాంత్‌ భార్యకు ఊరట.. ఆ కేసుకు బెయిల్ మంజూరు..

తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై గత కొన్నేళ్లుగా చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ సమయంలో .. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.. దీంతో ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది.. దీనిపై పెద్ద చర్చే జరిగింది..

ఇక ఇది కాస్త బెంగళూరులోని 1వ ఏసీఎంఎం కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో హాజరయ్యిన లతా రజినీకాంత్కు ఈరోజు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్, రూ.25,000 నగదు తో పాటు కొన్ని కండిషన్స్ పై ఆమెకు బెయిల్ మంజూరు చేసింది..లతా రజనీకాంత్ వెంట రజనీకాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఉన్నారు..

పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు..

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నియోజకవర్గాల్లో ఇన్ చార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. సీఎం కార్యాలయానికి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రి, రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇక, సీటు మార్పు విషయంపై ముఖ్య నేతలు, సీఎంఓ అధికారి ధనుంజయరెడ్డిని ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ వివరించి, సీట్ల మార్పుపై వారితో వైసీపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నారు.

టీడీపీ- జనసేన పార్టీ ఎవరికి టికెట్ వస్తుంది అనేది వాళ్లకే క్లారిటీ లేదు..

నెల్లూరు సిటీ పరిధిలోని కుసుమ హరిజన వాడలో 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు నగరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇద్దరు నాయకులు తిరుగుతున్నారు.. రెండు, మూడు రోజుల నుంచి నెల్లూరులో విచిత్రమైన పరిస్థితి ఉంది.. ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని నారాయణ ఒకవైపు తిరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొందరు టీడీపీ నేతలతో కలిసి జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి తిరుగుతున్నారు.. ఇంతకూ ఎవరు పోటీ చేస్తారో తెలియని పరిస్థితిల్లో ఉన్నారు.. ఎవరి టికెట్ రాకపోతే వాళ్లు మాయం అవుతారు.. వాళ్ళు కనిపించే పరిస్థితి ఉండదు అని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

 

Exit mobile version