Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు ఉపన్యాసం హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1996, 99 ఎన్నికల సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబుదే.. 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించిన ఘనుడు కూడా చంద్రబాబే.. హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగిన విషయం తెలుసుకోండి అని సూచించారు. హంద్రీనీవాను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు అని శైలజానాథ్ అన్నారు.

‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్‌లో షారుఖ్‌కు గాయాలు..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు.. ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్‌లో తాత్కాలిక బ్రేక్ పడిందనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం మేరకు, షూటింగ్ సమయంలో షారుఖ్‌కు గాయమైందని, ఆయనకు వైద్యులు ఒక నెల పాటు విశ్రాంతి సూచించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు కథనాలు పేర్కొన్నాయి. అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం అని వర్గాలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం జరుగుతోన్న ‘కింగ్‌’ షూటింగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే    “కింగ్” సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో.. ఈ బ్రేక్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షారుఖ్ త్వరగా కోలుకొని సెట్స్‌పైకి తిరిగి వచ్చేస్తాడనే ఆశతో అభిమానులు ప్రర్థనలు చేస్తున్నారు.. దీనిపై మూవీ టీం నుండి అప్ డేట్ రావాల్సి ఉంది.

మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు దొంగగా మారిన భర్త..

వివాహ బంధంలో కలహాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. ఇక, విడాకులు తీసుకున్న తరువాత చాలా మంది భర్తలు కోర్టు ఆదేశాలతో మేరకు తమ మాజీ భార్యలకు భరణం చెల్లిస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది వారికి తలకు మించిన భారం అవుతుంది. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌ నగరంలోని గణపతినగర్‌కు చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే వ్యక్తి కోర్టు ఆదేశాల ప్రకారం తన మొదటి భార్యకు నెలకు రూ.6 వేల భరణం చెల్లించాల్సి ఉంది. ఇక, తాను నిరుద్యోగిగా ఉండటంతో ఆ డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఇటీవల మనీష్‌నగర్‌లో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆర్ఎస్ఎస్ ముసుగులో ‘‘ఛంగూర్ బాబా’’ అరాచకాలు, మోడీ పేరు మిస్ యూజ్..

జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున్న హిందూ అమ్మాయిలను మతం మార్చే నెట్వర్క్ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. నేపాల్ సరిహద్దుల్లోని బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్‌ని కేంద్రంగా చేసుకుని ‘‘అక్రమ మతమార్పిడి’’ మాఫియాను నడిపిస్తున్నాడు. లవ్‌జీహాద్‌తో హిందూ మహిళలను వలలో వేసుకునేందుకు ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా ఈ నిధులు మిడిల్ ఈస్ట్‌లోని ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చాయి. ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా తనకు ‘‘ఆర్ఎస్ఎస్’’ సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగే వాడిని తెలిసింది. అధికారులను కలిసేటప్పుడు తాను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సీనియర్ కార్యకర్త అని చెప్పుకునేవాడు. ఛంగూర్ బాబా సంస్థ లెటర్ హెడ్‌పై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటోను కూడా ఉపయోగించుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు ఈదుల్ ఇస్లాం నిర్వహిస్తున్న భారత్ ప్రతికార్త్ సేవా సంఘ్ అనే సంస్థకు ఛంగూర్ బాబాను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సంస్థ పేరును వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఏపీలో హరి హర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న (జులై 24, 2025) విడుదల కానున్న ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ రేట్ల పెంపు కోరగా, ప్రభుత్వం మొదటి పది రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. హరి హర వీరమల్లు చిత్ర నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి కోరారు. అయితే, ప్రభుత్వం ఈ అభ్యర్థనను పరిశీలించి, మొదటి పది రోజులకు మాత్రమే ధరల పెంపును అనుమతించింది. 23న రాత్రి 9గంటలకు రూ.600 టికెట్ ధరతో ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు.

నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా… స్ట్రీట్ ఫైట్ రాదు

మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా స్ట్రీట్ ఫైట్ రాదు అని, మీదికి ఒక మాట, లోపల మరో మాట మాట్లాడటం నాకు అలవాటు లేదన్నారు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు అని ఆయన అన్నారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి, వాటిని తట్టుకున్నా. 2021 నుండి BRS లో నరకం అనుభవించా. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. శత్రువుతో నేరుగా కోట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం రాదు. సైకో, శాడిస్ట్ ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశాడో.. బీ కేర్‌ఫుల్ బిడ్డా అంటూ తన అనుభవాన్ని స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. “హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS కి 53 వేల మెజార్టీ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో నాకు తెలుసు,” అని హుజురాబాద్ తన బలమైన కోట అని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సవాల్‌.. చర్చకు సిద్ధమా..?

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివిధ ఆరోపణలు చేస్తూ కేటీఆర్‌ను బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. “కేటీఆర్ కంటే నేను గట్టిగా తిట్టగలుగుతా. కేదర్‌తో మాకు సంబంధం లేదంటున్నావు. కానీ కేదర్‌కి డ్రివెన్ కంపెనీ ఉంది. నీ బామ్మర్ది రాజ్ పాకాల వాడే కారు కేదర్ కంపెనీ పేరుతో ఉంది. సంబంధం లేకుంటే కేదర్ కంపెనీ కారును ఎందుకు వాడుతున్నాడు?” అని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. అలాగే, “డ్రగ్స్ కేసులో కోర్టు చెప్పింది ఒకటి, నువ్వు వక్రీకరించింది ఇంకొకటి. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు వెళ్తా” అని హెచ్చరించారు.

నేను ఎప్పుడైనా నేరం, హత్యా రాజకీయాలు చేశానా..? సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజకీయాలు పూర్తి కలుషితం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్న ఈ నేరస్థులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికల ముందు మోసపోయానని.. ఎప్పుడూ నేను నేరం చేశానా.. హత్య రాజకీయాలు చేశానా..? అని ప్రశ్నించారు. ఎస్వీ వర్శిటీలో చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడూ నేరం జోలికి పోలేదన్నారు‌. ప్రజలు ఆస్తుల రక్షణ తన తోలి ప్రాధాన్యతని… లా అండ్ ఆర్డర్‌కు తొలి బాధ్యత చేస్తానన్నారు. హింసా రాజకీయాలు ప్రోత్సహించనని స్పష్టం చేశారు. అలా హింసా రాజకీయాలు చేసే వారి గుండెల్లో నిద్రపోతానన్నారు.

రపా రపా డైలాగ్‌ కాదు.. బాలకృష్ణ, మహేష్ బాబులా చేయండి చూద్దాం..

రపా రపా డైలాగ్ పై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రపా రపా భాష వాడటం తప్పన్నారు. తప్పని తెలుసుకోవాల్సిందిపోయి సమర్దించడం కరెక్ట్ కాదని తెలిపారు. సినిమాల్లో చెప్పినప్పుడు బయట చెబితే తప్పేంటంటారని.. సినిమాల్లో చేసేవన్నీ బయట చెప్పాలనుకోవడం తప్పే అని స్పష్టం చేశారు. సినిమాలో బాలకృష్ణ తొడకొడితే 20 సుమోలు గాల్లోకి ఎగురుతాయి. మహేష్ బాబు 20అంతస్థుల బిల్డింగ్ పైనుంచి రైలులోకి దూకుతారు. బయట అలా చేసి చూపించగలరా? అని మంత్రి ప్రశ్నించారు. విషపూరిత వాతావరణంలోకి సమాజాన్ని నెట్టివేస్తున్నాం… మార్పు రావాలని కోరారు. ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఇటీవల కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో రప్పా రప్పా అనటం కాదు చేసి చూపించండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పేర్ని నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు.. అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ బియ్యం దొంగ పేర్ని నాని.. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు పేర్ని నాని వ్యాఖ్యలపై అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓరుగల్లు 40 ఏళ్ల కల సాకారమైంది..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరంగల్, ఖాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం. వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లు మంజూరు చేశాం. దీని ద్వారా 3వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించింది. మోడీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరుతుంది” అని అన్నారు. అలాగే, “వేయి స్తంభాల మంటపం, రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేశాం. త్వరలో వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ కూడా వస్తుంది. మోడీ వరంగల్‌కు ఏం ఇచ్చారో వరంగల్‌కి వచ్చి చూసి మాట్లాడాలి. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ ఎల్లప్పుడూ కమిట్మెంట్‌తో ఉంది” అని స్పష్టం చేశారు.

 

Exit mobile version