Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత!

ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తున్న కూటమి సర్కార్‌ ఇప్పుడు కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది… ఇక, స్త్రీ శక్తి స్కీమ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు… సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఆంధ్రప్రదేశ్‌ నివాసులైన మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు – ఐడీ ప్రూఫ్‌తో ఉచిత ప్రయాణానికి అర్హులు.. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్‌, చార్టర్డ్‌, ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ వర్తించదు.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని ఏసీ బస్సులకు ఈ స్కీమ్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు..

విద్యుత్ మీటర్ల పై నారాయణ ఫైర్.. మళ్లీ చంద్రబాబుకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయం..!

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చిన చంద్రబాబుకు గట్టి షాక్‌ తగిలింది.. ఆ తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు.. అయితే, మరోసారి చంద్రబాబుకు కరెంట్‌ షాక్‌ కొట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్ల పై ఫైర్‌ అయ్యారు.. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంభిస్తుందని విమర్శించారు.. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది.. అదానీ కంపెనీతో పాటుగా మరో మూడు కంపెనీలకు దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారు .. స్మార్ట్ మీటర్లు.. ప్రజల మెడకు ఉరితాడు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట.. కేసును కొట్టేసిన హైకోర్టు!

సీఎం రేవంత్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. సీఎంపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌.. కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాపూర్‌ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. హుజూర్‌నగర్‌లో 2021 ఉప ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. కొవిడ్, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డిపై కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

ఈవీఎంల ట్యాంపరింగ్‌తో అధికారంలోకి వచ్చారు.. ఇప్పుడు భయం పట్టుకుంది..!

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేయలేదని కూటమి నాయకులు చెబుతున్నారని.. కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే కూటమి నాయకులకు పేర్లు ఇచ్చారని ఆరోపించారు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది. తణుకు నియోజకవర్గంలో ఆరమిల్లి రాధాకృష్ణకు 72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే అని ఆరోపించారు.. ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎం ట్యాపరింగ్‌ జరిగిందని చెప్పిన మొదటి వ్యక్తి నేనే. ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు . కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

 డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సంచలన వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే మరో ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది ముమ్మాటికీ వాస్తవమని పేర్కొన్నారు. అసలు వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా రాష్ట్ర ముఖ్య‌ నేత‌లు అడ్డుకుంటూ, అవ‌మానిస్తున్న‌ వాస్త‌వాన్ని మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధ‌న్య‌వాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, అవినీతి ర‌హిత‌ పాల‌న అందించాల‌ని కోరుతున్నా. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నా’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన G.O ప్రకారం ఒక్క స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ, హైడ్రా లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు. అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా MA&UD సెక్రటరీ కూడా జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన టీ కప్పులో తుఫాను లాంటిదని అభివర్ణించారు.

ప్రజాపాలన అంటే ఇదేనా..?

జగిత్యాలలో జరిగిన దారుణ ఘటనపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని, కలెక్టర్ ఎదుటే కానిస్టేబుల్ ఈడ్చి, అతని వీల్‌చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఎమ్మెల్సీ కవిత ఈ సంఘటనను “ప్రజాపాలన అంటే ఇదేనా?” అని ప్రశ్నిస్తూ, దీనిని అత్యంత దుర్మార్గమైన చర్యగా ఖండించారు. బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక, తన కళ్ల ముందే ఇంతటి ఘటన జరిగి కూడా స్పందించని జగిత్యాల కలెక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆయిల్ ఫార్మ్ పంట రహస్యం చెప్పిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క రైతులకు ఆయిల్ ఫార్మ్ పంట ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆయిల్ ఫార్మ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు కనీసం ఐదు ఎకరాలలో ఈ పంటను సాగు చేయాలి. ఈ పంటకు ఉన్న గ్యారంటీ మరే పంటకు లేదు” అని తెలిపారు.

రైతుల భారం తగ్గించేందుకు సబ్సిడీతో ఒక్కో మొక్కను రూ.25కే అందిస్తున్నామని ఆమె వివరించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల మేలుకోరే ప్రభుత్వం. రైతులకు దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చిన మొదటి రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే దేశంలోనే మొదటిసారి రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినది కూడా కాంగ్రెస్‌” అని గుర్తుచేశారు.

ట్రంప్ సుంకాల వల్ల అమెరికాకే నష్టమా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

 

Exit mobile version