ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా!
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో 2022లో ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. 2022-2028 వరకు కవిత పదవీ కాలం ఉంది. మరో రెండున్నర సంవత్సరాల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
గణేష్ మండపం దగ్గర చికెన్ భోజనాలు..! వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీతో పాటు 30 మందిపై కేసు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు ఏర్పాటు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 30 మందిపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.. నిన్న దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్‌లో చికెన్ బిర్యానీతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఆ అన్నదానం కార్యక్రమం పక్కనే గణేష్ మండపం ఉంది.. వైసీపీ నాయకులు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు.. ఇక, నందిగామ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ వన్ శాతకర్ణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మరో 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు..
నాన్న నిర్ణయాన్ని శిరసావహిస్తుస్తా?.. ఏ పార్టీలో చేరను!
తన తండ్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను శిరసావహిస్తా? అని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ వివరణ కోరలేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ… ‘నేను ఏ పార్టీలో చేరను. ఏ పార్టీతోనూ నాకు అవసరం లేదు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. నాన్న (కేసీఆర్) ఇప్పుడు కూడా కొంత ఒత్తిడిలో ఉన్నారు. నాన్న తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తా?. నన్ను ఏ రోజు పార్టీ వివరణ కోరలేదు’ అని చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు.. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగం
ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్‌స్కీ, పశ్చిమ దేశాధినేతలతో కూడా చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంతలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడింది. తాజాగా పుతిన్ చైనాలో సైనిక కవాతు వీక్షిస్తుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దీంతో నాటో మిత్రదేశమైన పోలాండ్ జెట్‌లతో యుద్ధానికి దిగింది. బుధవారం ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. రష్యా భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. కైవ్ నుంచి పశ్చిమాన ఉన్న లివివ్, వోలిన్.. ఇలా 24 ప్రాంతాలను తాకాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం తప్పికొట్టింది. మూడు క్షిపణులు, 69 స్ట్రైక్ డోన్లను 14 చోట్ల ఢీకొట్టాయి. కూలిన శిథిలాలు 14 చోట్ల పడిపోయాయి.
మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం…
మిజోరంలోని ఒక గుహలో 700 సంవత్సరాల నాటి అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు, తొడ, ఎముకలు సహా 700 సంవత్సరాలకు పైగా పురాతన మానవ అవశేషాలను పురావస్తు అధికారులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మిజో ప్రజల చరిత్రను పునర్నిర్వచించగలదని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) మిజోరాం యూనిట్ తెలిపింది.
చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. అవి ఎక్కడికీ పోవు
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆయన, “చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అవి ఎక్కడికీ పోవు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.”నవ్వుతూ కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. కానీ చేసిన పాపాలు ఊరికే పోవు. తప్పకుండా అనుభవించాల్సిందే. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్న అంతర్గత గొడవలపై కూడా ఆయన స్పందించారు. “మీ పంపకాలలో వచ్చిన పంచాయతీ మీరు పూడ్చుకోవాలి. మీ కుటుంబంలో, మీ వర్గంలో ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. ఆ విషయాల్లో మమ్మల్ని లాగకండి. మా ప్రభుత్వానికి, నాకు ఎలాంటి ఆసక్తి లేదు” అని స్పష్టం చేశారు.
ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం..
జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రులు లేదా ప్రతి పక్ష రాష్ట్రాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు పాలించే ఈ ఎనిమిది రాష్ట్రాలు, వస్తు సేవల పన్నులో శ్లాబులను పునర్నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదన వల్ల అన్ని రాష్ట్రాలకు ఏటా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం నష్టం జరుగుతుందని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం ఈరోజు రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే రెండు రోజుల సమావేశంలో వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల ప్రతిపాదనలు సంస్కరణలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముందే, ప్రతిపక్షాలు పాలించే ఎనిమిది పెద్ద రాష్ట్రాలు తమ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి.
కవిత కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కుమ్మక్కయ్యారని తాను ఇంతకుముందే చెప్పానని రఘునందన్ గుర్తుచేశారు. “బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేను మాట్లాడదల్చుకోను. అయితే కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలి” అని అన్నారు.
బెయిల్ రాకుండా చేయడం కోసమే
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున రెడ్డిని దోషిగా ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తిని దోషిగా పరిగణించి. ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని ములాఖాత్ లో కలిసి వచ్చిన. ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ మిధున్ రెడ్డిని దోషిగా పోలీసులు అధికారులు, రాజకీయ నాయకులు నిర్ధారించకూడదని హితవు పలికారు. ప్రత్యర్థులు అందరినీ దోషులుగా చూపించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మిథున్ రెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు అరెస్టులు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. బెయిల్ రాకుండా చేయడం కోసమే ఛార్జ్ షీట్ వేయట్లేదని విమర్శించారు.
