Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో మరొకరి అరెస్ట్

సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో గోపాలపురం పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కృష్ణ అనే ఏజెంట్ ను అరెస్ట్ చేశారు. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ ల సంఖ్య 12కి చేరింది. విశాఖ పట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు గాలిస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది పిల్లలు కలవారిని, పేద కుటుంబాలు లక్ష్యంగా ఏజెంట్లు హర్షరాయ్, కృష్ణ, సంజయ్ ల వేట కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను ఏజెంట్లు హైదరాబాద్ లోని సృష్టి రిసెప్షనిస్ట్ నందినికి అందిస్తున్నట్లు తెలిపారు.

అసలు నువ్వు తల్లివేనా.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుపై రాయితో దాడి

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ దైవంతో సమానం. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురునిలిచి కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా ఆ తల్లి విలవిల్లాడిపోతది. కానీ, ఓ తల్లి మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి కన్న కొడుకుపై రాయితో దాడి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కన్న కొడుకుపై రాయితో దాడి చేసిన కసాయి తల్లి వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్ – పరిశ్రమలో కలకలం

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోక్సో కేసులో అరెస్టయిన ఘటన సినిమా రంగంలో సంచలనంగా మారింది. గత నెలలో  ఆయన‌పై.. మైనర్ బాలిక‌తో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కృష్ణపై పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదైంది.  కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ పరారీలోకి వెళ్లిపోయారు. కానీ సాంకేతిక ఆధారాలు – ఫోన్ ట్రాకింగ్, సోషల్ మీడియా లొకేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా అతను బెంగళూరులో తలదాచుకున్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని హైదరాబాద్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

జగన్ కూడా రేపు జైలుకు వెళ్లాలి..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అన్నదానికి రుజువులు చూపించగలవా జగన్.. మీ హయంలో ఎన్ని హామీలు అమలు చేశారు.. రైతు భరోసా ఎంత ఇస్తామని ఎంత ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇక, కూటమి ప్రభుత్వం 20 వేల రూపాయలు ఇస్తుంది.. మీ హయంలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా.. 2.5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల పెట్టుబడులు వస్తున్నాయి.. ప్రైవేట్ పరంగా రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి.. అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్ళే క్రమంలో అలజడులు సృష్టిస్తున్నారు.. రేపు జగన్ కూడా జైలుకు వెళ్లాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

సర్ జడేజా అంటే ఆమాత్రం ఉంటది.. లక్ష్మణ్, గవాస్కర్ రికార్డులను కొల్లగొట్టిన జడ్డూ భాయ్!

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు సిరీస్‌లో 6వ స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును అధిగమించాడు. 2002లో వెస్టిండీస్ పర్యటనలో లక్ష్మణ్ 474 పరుగులు చేసిన రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసి 500 పరుగుల మార్కును దాటేశాడు. దీంతో ఈ టెస్టు సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనత శుభ్‌మన్ గిల్ (754 పరుగులు), కేఎల్ రాహుల్ (532 పరుగులు)లకు దక్కగా, జడేజా 516 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.

తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం

ఖమ్మం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని, శైలంపైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది నీటి ప్రాజెక్ట్ ల కోసమే అని, దురదృష్టం పదేళ్ల పాటు కృష్ణ, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్ట్ లు కట్టలేదన్నారు. గోదావరి నుంచి పూర్తి గా దిగువకు నీళ్లు వదులుతారని, కృష్ణ మీద పైన ఆంధ్రా వాళ్ళు నీళ్లు తీసుకుంటారన్నారు భట్టి విక్రమార్క.

లగేజీ విషయంలో గందరగోళం.. స్పైస్‌జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి(వీడియో)

శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్‌జెట్ విమానం SG-386 బోర్డింగ్ గేట్ వద్ద ఒక సీనియర్ ఆర్మీ అధికారి నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 26న అదనపు క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించమని సిబ్బందికి కోరగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది కథనం ప్రకారం.. ఆ ఆర్మీ అధికారి వద్ద మొత్తం 16 కిలోల బరువున్న రెండు క్యాబిన్ బ్యాగులు ఉన్నాయి. వాస్తవానికి లగేజీ గరిష్ట పరిమితి 7 కిలోలు మాత్రమేనని స్పైస్‌జెట్ తెలిపింది. సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆ నిబంధన గురించి అతనికి తెలియజేసి ఛార్జీ చెల్లించమని కోరారు. అయితే ఆ అధికారి ఛార్జీలు చెల్లించేందుకు నిరాకరించి, బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయకుండానే ఏరోబ్రిడ్జిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇది పౌర విమానయాన భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పైస్‌జెట్ తెలిపింది. దీంతో అక్కడే ఉన్న CISF అధికారులు అతన్ని గేటు వద్దకు తీసుకెళ్లారు.

కూతురుతో కలిసి భర్తను చంపిన భార్య.. సహాయం చేసిన మరో ఇద్దరు..

భర్తలను హత్యలు చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్రమ సంబంధాలు, పెళ్లి తర్వాత వేరే వారితో ప్రేమ వ్యవహరాల కారణంగా కట్టుకున్నవాడిని కడతేరుస్తున్నారు. తాజాగా, అస్సాంలో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, తన కుమార్తెతో కలిసి భర్తను హత్య చేసింది. దీనికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అయితే, హత్యను తప్పుదారి పట్టించేందుకు భార్య కట్టుకథ అల్లింది.

మహిళ, 9వ తరగతి చదువుతున్న తన కుమార్తె, ఇద్దరు అబ్బాయిలతో కలిసి హత్య చేశారు. వీరిందర్ని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. పోలీసుల్ని తప్పుదారి పట్టించేందుకు తన భర్త స్ట్రోక్‌తో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. జూలై 25 జమీరాలోని లాహోన్ గావ్‌లోని బోర్బరువా ప్రాంతంలోని తన నివాసంలో ఉత్తమ్ గొగోయ్ మృతి చెంది కనిపించాడు. అతడి భార్య బాబీ సోనోవాల్ గొగోయ్, ఆమె కుమార్తెలు గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి కౌంటర్‌

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బీఆర్‌ఎస్‌లోని ఒక కీలక నేతనే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే BRS లిల్లీపుట్‌ అంటూ కవిత ఫైర్‌ అయ్యారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిన లిల్లీపుట్‌ అన్న కవిత.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయడం అనుచితమని మండిపడ్డ కవిత, బీఆర్‌ఎస్‌ నాయకులే తనపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.

బనకచర్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టంచేస్తూ, “మా రిపోర్టుల వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగింది, మా రిపోర్టర్‌ల కృషితోనే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను ఆపింది” అని ఆయన పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి అనర్ధం తెస్తుందని హెచ్చరిస్తూ, “దాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతటి సాహసానికైనా సిద్ధం” అని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, “ప్రధాన పదవుల్లో ఉన్నవారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు” అని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన న్యాయపరమైన రిపోర్టును రేపు కేబినెట్‌లో ప్రవేశపెడతామని ప్రకటించారు. “ఆ రిపోర్టు బయటపడ్డాక బీఆర్‌ఎస్‌ నాయకుల పరిస్థితి ఏమవుతుందో చూడాలి” అని అన్నారు.

 

Exit mobile version