ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించి.. టీ చేసిన సీఎం!
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
సీఎం చంద్రబాబు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి.. ఒంటరి మహిళ పింఛను అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రేపటి నుంచే ఇల్లు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీపం 2.0 పథకంలో భాగంగా నాలుగు నెలలకోసారి ఉచిత సిలిండర్ అందిస్తారు. లబ్ధిదారులు ముందుగా డబ్బు చెల్లించినా.. సిలిండరు ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారు ఖాతాలో రాయితీ జమ అవుతుంది.
అధికారుల్లో ఇంకా పాత వాసన ఉంది.. హోంమంత్రి సీరియస్
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా గ్యాస్ పొయ్యి వెలిగించాలి అంటే మహిళలు భయపడేవారని పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.. అప్పటిలో మహిళల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దీపం పథకం ప్రవేశపెట్టారని అనిత అన్నారు. ఇప్పుడు మరల దీపం-2 పథకం ప్రవేశపెట్టి, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ?
భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు డిసెంబర్ మాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి 6.25 శాతానికి చేరుకుంటుంది. ఇకపోతే, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.49 శాతానికి పెరగగా, ప్రస్తుత త్రైమాసికంలో ఇది 4.9 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. అంతేకాకుండా ఆ తర్వాతి జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6 శాతానికి తగ్గవచ్చని అంచనాలు వేస్తున్నారు. దీంతో ఆర్‌బీఐ రేట్లను తగ్గించేలా అర్థమవుతుంది.
ఢిల్లీలో దారుణం.. దీపావళి సంబరాల్లో కాల్పులు.. ఇద్దరి హత్య
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. నిలబడి ఉన్న మరో వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను వెంబడించిన మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా చనిపోయాడు. ఒకేరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లే సాధ్యం..
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌లో భాగంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే భయం భయంగా స్థానికులు ఉండేవారు.. ఇప్పుడు అందరూ చిరునవ్వుతో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు. అధికారంలో రాగానే పింఛన్లు మూడు నెలలు బకాయి ఒకేసారి ఇచ్చి హామీ నెరవేర్చుకున్నాం.. సూపర్ సిక్స్‌లో ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దాన సమస్యలను త్వరలో పరిష్కరిస్తుంది.. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు.. దానిపై కార్యాచరణ రూపొందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
బీసీ కులగణనపై ప్రజలందరూ సహకరించాలి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణనపై రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. 10 నవంబర్ 2023 రోజున రాహుల్ గాందీ మాట ప్రకారము కర్నాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సమక్షంలో కామారెడ్డి బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4 ఫిబ్రవరి 2024 రోజున జరిగిన మంత్రి మండలి నిర్ణయము మేరకు మొత్తము తెలంగాణ రాష్ట్రములో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది, రాజకీయ , కులాల సర్వే (కుల గణన)) చేపట్టాలని ఈ కేబినెట్ తీర్మానించిందన్నారు పొన్నం ప్రభాకర్. రాష్టంలో వెనుకబడిన తరగతుల, ఎస్‌సి&ఎస్‌టి పౌరులు , రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది రాజకీయ అవకాశాలను ప్లాన్ చేసి అమలు చేయడానికి గాను 16 ఫిబ్రవరి 2024 రోజున శాసన సభలో ఏకగ్రీవంగా తీర్మానించడమైనదని ఆయన తెలిపారు. ఇట్టి తీర్మానమునకు అనుగుణముగా జి.ఓ.ఏంయెస్. నెం. 26, 15.03.2024 ప్రకారము కుల గణన చేయుటకు గాను తెలంగాణ బీసీ కమిషన్ యొక్క తీర్మానము క్రమము బీసీ సంక్షేమ శాఖ ద్వారా 150 కోట్ల రూపాయలను విడుదల చేయడము ప్రక్రియ ప్రారంభము జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు
విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా వున్నారని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ సచివాలయంలో పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. అందుకే ఎన్నడు లేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ 40% పెంచడం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు 40 శాతం చార్జీలను పెంచిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. డైట్ చార్జీలు ఏడేండ్లుగా, కాస్మెటిక్ చార్జీలు గత 16 సంవత్సరాలుగా పెరగలేదని ఆమె అన్నారు. ఏడు సంవత్సరాల క్రితం డైట్ చార్జీలు కొంచెం పెంచి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఏడేళ్లుగా ధరలు విపరీతంగా పెరిగిన అనుగుణంగా డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని ఆమె మండిపడ్డారు. దీంతో పిల్లలు అర్ధాకలితో ఇబ్బందులు పడ్డారని, విద్యా శాఖకు బీఆర్‌ఎస్ చేసింది శూన్యమని ఆమె మండిపడ్డారు. బీర్‌ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైందని ఆమె అన్నారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తొక్కి నారతీస్తాం.. పవన్ కీలక వ్యాఖ్యలు
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపం పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదు.. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 2,684 కోట్లు, ఐదేళ్లకు13,425 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి వచ్చాను.. ఇక్కడ స్వయంబుగా వెలసిన లక్ష్మినరసింహ స్వామిని ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.
కాంగ్రెస్‌వన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే
రేవంత్, కేటీఆర్ మీరు ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు… మోకాళ్ల యాత్ర చేయండన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. మోడీపై కాంగ్రెస్ యుద్దం దేనికోసం? పేదల అభ్యున్నతికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నందుకా? అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ వన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని ఆయన సెటైర్లు గుప్పించారు. దీపావళి దాటినా రాజకీయ బాంబులు పేల్చలేదేం? కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం
పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరానికి విఘాతం కలుగుతుంది. పోలవరానికి ఉరి అనేది నిజం. పోలవరం ప్రాముఖ్యత, అవసరం, నాయకులతో పాటు ప్రజలకు తెలుసు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పనులు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. ఇరిగేషన్ మంత్రికి తెలియని అంశాలు చాలా ఉన్నాయి. నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను. డయా ఫ్రమ్ వాల్‌లో లోపాల వల్ల పోలవరం పూర్తి కాదు అని నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను. పోలవరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ బృందం పరిశీలించి కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు.’’ అని అంబటి తెలిపారు.