వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలు ఔట్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది. వైసీపీలో ఈ కీలక పరిణామం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.
బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చే వరకు.. పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తాం..
పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కలాట్, క్వెట్టాలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 29 మంది పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు.
ఎన్నికల ముందు నితీష్ వరాలు.. 125 యూనిట్ల విద్యుత్ బిల్లు కట్టొద్దని ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రెండు, మూడు నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఓటర్ల లిస్ట్ తుది జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జాబితాను ప్రకటించగానే రెండు, మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయనుంది. ఇక అన్ని పార్టీలు ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి. ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇక జేడీయూ నేతృత్వంలోని అధికార పార్టీ ప్రజలపై వర్గాల జల్లు కురిపించింది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నామని… ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. జులై బిల్లులను ఎవరూ కట్టనక్కర్లేదని చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని నితీశ్ కుమార్ వెల్లడించారు.
ఇండిగో ఫ్లైట్ గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. ‘పాన్ పాన్ పాన్’ అంటూ పైలట్ కాల్..
విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిన తరువాత ఈ భయాలు మరింత పెరిగాయి. తాజాగా ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఇంజిన్‌లో సమస్య అని చెబుతున్నారు. ఇండిగో విమానం 6E 6271 ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరింది. విమానం ల్యాండింగ్ సమయం రాత్రి 9.42 గంటలకు షెడ్యూల్ చేశారు. కానీ పైలట్ రాత్రి 9.25 గంటలకు ప్రమాద సంకేతాన్ని ఇచ్చాడు. అయితే, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు ముందు, పైలట్ ‘పాన్ పాన్ పాన్’ ప్రకటించాడు.
ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి కర్నూల్ బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌లను చంద్రబాబు కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రంగాల వారీగా పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలకు సంబంధించి జనశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీసీఐ సదస్సులో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.
రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
గుండెపోట్లు పెద్దోళ్లకే కాదు.. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా సంభవిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మధ్య వయస్కులు ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోతున్నారు. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇక కర్ణాటకలో అయితే నెలల వ్యవధిలోనే పదులకొద్దీ హార్ట్‌ఎటాక్‌తో చనిపోయారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం దర్యాప్తు చేయాలని వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా చిన్న పిల్లలు కూడా చనిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కళ్ల ముందు కనిపించిన వారు.. అంతలోనే విగతజీవులుగా మారడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో 4వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థిని గుండెపోటుతో చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సికార్‌లోని దంతా పట్టణంలో ప్రాచి కుమావత్(9) అనే 4వ తరగతి విద్యార్థిని స్కూల్‌కు వచ్చింది. ఉదయం ప్రార్థనలు, అసెంబ్లీలో చురుగ్గానే పాల్గొంది. మధ్యాహ్నం భోజన సమయంలో హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే పాఠశాల స్పందించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలిక ప్రాణాలు వదిలింది. గుండెపోటుతో బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. దీంతో పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటి? అని తల్లడిల్లిపోయారు. మంగళవారం ఉదయం ఆరోగ్యంగా ఉన్న బాలిక.. అంతలోనే చనిపోవడం పాఠశాల సిబ్బందిని కలవరపాటుకు గురి చేసింది.
డిజిటల్ అరెస్ట్ మాయతో కోట్లకు మోసం.. హైదరాబాద్ మహిళకు టోకరా
హైదరాబాద్ నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు టోకరా వేసిన సంఘటన సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టించి కోట్ల రూపాయల మోసం చేశారు. ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు, పేర్ని రాజ్‌కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కుమార్ సైబర్ నేరగాళ్లకు ముల్ అకౌంట్లను (ఫేక్ అకౌంట్లు) అందించడంలో కీలకపాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్ట్ మాయతో ఓ మహిళను మోసం చేసిన నిందితులు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అనేక మందిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, డిజిటల్ అరెస్ట్ అంటూ మహిళను బెదిరించి, ఆమె ఆస్తులు మరియు బంగారం మొత్తం తాకట్టు పెట్టించారు. అనంతరం ఆ మొత్తాన్ని దోచుకుని ఫైనాన్స్ సంస్థల ద్వారా నకిలీ ఖాతాల్లోకి మళ్లించారు. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన సైబర్ నేరగాడు గోయల్‌తో కలిసి పనిచేసిన అల్లుడాస్ సుధాకర్‌ను కూడా అరెస్ట్ చేశారు.
చంద్రబాబు 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతున్నారు.. బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంతకాలం బతుకుతావ్?’ అని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ధ్వజమెత్తారు. చందబాబుకు 76 ఏళ్ల వయసా?, ఎన్నాళ్లు ఉంటాడో చెప్పలేమా.. ఇలాంటి మాటలేనా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు. తాను సీఎం చంద్రబాబును మొన్న ఢిల్లీలో చూశానని, 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను చకచకా కలుస్తారన్నారు. గతంలో వైఎస్ జగన్ దొంగచాటున ఢిల్లీ వెళ్లే వారని, 16 మందిలో ఆరుగురిని కలిసేవారని, మీడియాకు ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు, రాష్ట్రం గురించి ఏ రోజున ఢిల్లీలో మాట్లాడిన పాపాన పోలేదు అని బుద్దా వెంకన్న విమర్శించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వచ్చాక.. వేళ్లులన్నీ పైలట్ వైపే చూపిస్తున్నాయి. కాక్‌పిట్‌లో రికార్డైన వాయిస్ ప్రకారం.. ఫ్యూయల్ స్విచ్‌లు ఎందుకు ఆపావంటూ అడగడం.. లేదంటూ ఇంకొకరు సమాధానం చెప్పడం.. ఇలా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ క్లియర్‌గా రికార్డైంది. అంటే ఇదే విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తుండగా ఎందుకు రెండు స్విచ్‌లు ఆగిపోయాయని నిపుణుల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఒకేసారి రెండు స్విచ్‌లు ఆపేసినట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
న్యూడ్ వీడియోలు చిత్రీకరణ.. నలుగురు యువకులను చితకబాదిన యువతులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ ఘటన కలకలం రేపుతోంది. లాడ్జిలో దిగిన యువతుల న్యూడ్ వీడియోలని చిత్రీకరించారనే ఆరోపణతో.. నలుగురు యువకులను యువతులు చితకబాదారు. ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని ద్వారకలో బాయ్స్ హాస్టల్, లాడ్జి పక్కపక్కనే ఉన్నాయి. హాస్టల్‌లో నుంచి లాడ్జి బాత్రూంలోకి ఫోన్‌లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపణలు చేశారు. నాలుగు రోజులు నుంచి తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారు అంటూ మరో మహిళ యువకులపై దాడికి పాల్పడింది. నలుగురు యువకులను యువతులు చితకబాదారు. దేహశుద్ధి అనంతరం ద్వారక పోలీసులకి యువకులను అప్పగించారు యువతులు. ద్వారక పోలీసులు యువకులు సెల్ ఫోన్లు పరిశీలిస్తున్నరు. యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లాడ్జిలో ఉండే వారు యువకులకు సహరిస్తున్నారా? అని ఆరా తీస్తున్నారు.
