పాక్ కు గూఢచర్యం.. డీఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్‌ను అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కోసం గూఢచర్యం చేయడం, దేశ రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు పంపడం వంటి ఆరోపణలపై రాజస్థాన్ CID ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది. మహేంద్ర ప్రసాద్‌ను ఆగస్టు 13 బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి నుంచి అతన్ని రిమాండ్‌కు తీసుకెళ్లి ప్రశ్నించనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని, రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విదేశీ ఏజెంట్లు నిర్వహించే దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచిందని సిఐడి ఇన్‌స్పెక్టర్ డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు.
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక పురోగతి
హైదరాబాద్‌లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్‌పై వెళ్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు దొంగలు రెండు బైకులపై పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ముఖాలకు మాస్కులు, తలకు క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వారి కదలికలు అనుమానం కలిగించాయి. దర్యాప్తులో భాగంగా, దోపిడీకి ఉపయోగించిన బైకులు కూడా వారు దొంగిలించినవేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆరుగురినీ విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు వెనుక ఉన్న ఇతర వ్యక్తుల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
10వ రోజుకు చేరుకున్న టాలీవుడ్ బంద్.. ఈ రోజు సమ్మె విరమణకు ఛాన్స్
సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ కో ఆర్డినేషన్ మెంబర్స్ తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల చర్చలు జరపబోతున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి సూచనల తో చర్చలు జరుపనున్నారు. చర్చల అనంతరం సమ్మె పై ప్రకటన చేయనున్నారు ఇరు వర్గాలు. ఈరోజు జరిగే చర్చల్లో అంతిమంగా అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. సోమవారం తెలంగాణ ఎఫ్ డి సి ఛైర్మెన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు , ఫెడరేషన్ నాయకులతో విడి విడి గా చర్చించిన మంత్రి కోమటి రెడ్డి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం అని ఫెడరేషన్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడం తో ఫెడరేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు యూనియన్ లకు తప్పించి మిగతా యూనియన్ సభ్యులకు రూ. 2000 వేలు లోపు కార్మికులకు ఓవరాల్ 25 % వేతనాలు పెంచిన నిర్మాతలు. రూ. 2000 పైన రోజు వారి వేతనాలు ఉన్న డాన్సర్స్ ఫైటర్స్ టెక్నీషియన్స్ యూనియన్ వాళ్లకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు. ఆ మూడు యూనియన్స్ కు వేతనాలు పెంచితేనే సమ్మె విరమణ చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. నిర్మాతలు పెట్టిన మిగతా కండిషన్ లు దశల వారీగా అమలు చేస్తామన్నారు ఫెడరేషన్ నాయకులు. ఈరోజు జరిగే ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల చర్చలపై అందరు ఎదురుచూస్తున్నారు.
టెక్సాస్‌లో పట్టాలు తప్పిన రైలు.. చెల్లాచెదురుగా పడ్డ ట్యాంకర్లు
అమెరికాలోని టెక్సాస్‌లో రైలు పట్టాలు తప్పింది. 35 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరగగానే అడవిలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదకరమైన పదార్థాలు ఉండడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. టెక్సాస్‌లోని పాలో పింటో కౌంటీలోని గోర్డాన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రైలు పట్టాలు తప్పింది. కోల్‌విల్లే రోడ్‌పై ఉన్న వంతెనపై మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో 35 బోగీలు పట్టాలు తప్పాయి. అందులో కొన్ని బోగీలు ప్రమాదకరమైన పదార్థాలను తీసుకువెళుతున్నట్లు సమాచారం. అత్యవసర సిబ్బంది స్పందించి ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ప్రమాదానిక గల కారణాలను అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలు ఇవే
గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గోల్డ్ పై సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించిన తర్వాత నేడు మరోసారి పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 50 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గింది.హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,135, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,290 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో రూ.92,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో రూ. 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,24,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,14,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
మీరు హద్దు దాటొద్దు.. ప్రమాదం తెచ్చుకోవద్దు!
నేషనల్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తుంటే విదేశీ క్రికెటర్లతో మ్యాచులు ఆడాలి.. అలాంటప్పుడు బ్యాటర్‌ను ఔట్ చేసిన ఆనందంలో కాస్త అగ్రెసివ్‌గా సంబరాలు చేసుకున్నా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు. అయితే, ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ క్రమశిక్షణ కమిటీ నిత్యం అప్రమత్తంగా ఉంటుంది.. ‘ఓవర్’గా అనిపిస్తే దానికి తగినట్టుగా ‘శిక్ష’ను విధిస్తుంది. ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అంటే పెద్దగా పరిచయం అవసరం ఉండదు.. అదే దేశవాళీ లీగులకు వచ్చే సరికి.. ప్లేయర్స్ అందరు మళ్లీ కలిసి ఆడాల్సిన వస్తుంది. అయినా సరే, తమ షార్ట్ టెంపర్‌ను మాత్రం అదుపులో పెట్టుకోకపోతున్నారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ లీగ్స్ లోనూ కొందరు ఆటగాళ్లు ఇలాంటి వివాదాలకు కేరాఫ్ అడ్రాస్ గా నిలుస్తున్నారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు శ్రీకారం..
రాజధాని అమరావతిలోని తుళ్ళూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. భూమిపూజ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హాస్పిటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే E-7 రహదారిని ఆనుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నూతనంగా నిర్మించనున్నారు. మొత్తం 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. మూడు దశలల్లో ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 750 కోట్లతో మొదటి ఫేజ్ 500 పడకల హాస్పటల్ నిర్మాణం చేపట్టనున్నారు. రెండో విడతలో మరో 500 పడకలకు విస్తరించనున్నారు. 2028 చివరి నాటికి మొదటి దశ పనులు పూర్తికానున్నట్లు తెలిపారు.
తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు…
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపధ్యంలో, వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, బంగాళాఖాతంలో ఆగస్టు 13 (బుధవారం) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఉత్తర అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కి.మీ ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మహిళకు ఎస్సై లైంగిక వేదింపులు.. వీడియో కాల్ లో బట్టలు విప్పి..
కొందరి పోలీసుల ప్రవర్తన పవిత్రమైన, బాధ్యతకలిగిన వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. బాధితుకు న్యాయం చేకూరాల్సిందిపోయి.. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ముదిగుబ్బ మండలంలోని పట్నం స్టేషన్ ఎస్సై రాజశేఖర్ ఓ మహిళను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే కేసులో న్యాయం చేస్తానని, లేకపోతే ఇబ్బందులు తప్పవని ఓ గిరిజన మహిళను బెదిరించాడు. గరుగుతండాకు చెందిన ఓ మహిళ తమ బంధువులతో కలిసి విడాకుల కేసు విషయంపై రెండు నెలల కిందట పోలీసులను ఆశ్రయించింది.
సాక్షాత్తూ పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేశారు..
వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడటం లేదు.. ప్రజాస్వామ్యం లేని పరిస్తితుల్లో ఉంది అనటానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు.. 15 బూతుల్లో కూడా వైసీపీ ఏజెంట్లు లేరు.. బూత్ దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి..
