Gruhalakshmi: తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత స్థలం, ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా..గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు ప్రభుత్వం గడువు విధించింది. అర్హులైన వారు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇవ్వగా… సాయంత్రం పలు కలెక్టరేట్లలో గడువులు, ఇతర వివరాలతో కూడిన ప్రకటనలు జారీ చేశారు.
ఇవి తప్పనిసరి..
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఖాళీ భూమి రిజిస్ట్రేషన్, కులం, ఆదాయ రుజువు, ఆధార్, ఆహార భద్రత కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాఫీలను జతచేయాలి. దరఖాస్తుల స్వీకరణకు ఎమ్మార్వో, మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులతో పాటు ఈ నెల 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను 20వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. 25వ తేదీలోగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆమోదం పొందిన లబ్ధిదారులకు పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ మార్గదర్శకాలు..
1. ఈ పథకం కింద ప్రభుత్వం 100 శాతం సబ్సిడీని రూ. 3 లక్షలు ఈ ఆర్థిక సహాయం అందజేస్తుంది.
2. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు అందించనున్నారు.
3. మహిళల పేరుతో ఆర్థిక సహాయం అందజేస్తారు.
4. మహిళా లబ్ధిదారుని పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలి (జనధన్ ఖాతాను ఉపయోగించవద్దు).
5. కలెక్టర్, కమిషనర్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
6. ప్రభుత్వం మూడు దశల్లో సహాయం చేస్తుంది: నేలమాళిగ స్థాయి, పైకప్పు స్థాయి మరియు ఇంటి స్లాబ్.
7. ఇప్పటికే ఆర్‌సిసి ఇళ్లు ఉన్నవారు మరియు ఆర్డర్ 59 కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అర్హులు కాదు.
8. ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతం మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.
మరోవైపు.. ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం చెప్పడంతో అర్హులైన పేదలు ఆందోళనకు గురవుతున్నారు. దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు కుల, అధా ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారని.. వాటిని పొందేందుకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని.. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల తర్వాత తమకు పత్రాలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా మూడు రోజులే సమయం ఇవ్వడంతో వాటిని ఎలా తెచ్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎమ్మార్వోలు బదిలీపై వెళ్లారని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. గడువు పొడిగించే విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.
Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ