తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
కాగా తెలంగాణలో మొత్తం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు తాజాగా అనుమతులు కూడా రావడంతో ఈ రోజు టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. టెట్ నిర్వహణ పూర్తయిన వెంటనే టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారు కూడా అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవో సైతం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే SGT పోస్టులకు బీఈడీ చేసిన వారికి కూడా అర్హత లభించనుంది.