హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా, పార్టీ నుంచి బహిష్కరణ.. పార్టీ అధినాయకత్వంపై ఆరోపణలు అన్ని జరిగిపోయాయి… అయితే, ఈ వ్యవహారంపై మీడియాచిట్‌చాట్‌లో స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కౌశిక్ చిన్న పిల్లగాడు.. అవి కౌశిక్ మాటలు కాదు.. సీఎం కేసీఆర్ మాట్లాడించిన మాటలు అన్నారు.
ఇక, హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించబోమన్నారు రేవంత్ రెడ్డి.. నాకు కౌశిక్ వ్యవహారం ముందే తెలుసన్న ఆయన.. టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నాడని నాకు ముందునుంచే సమాచారం ఉందన్నారు. అయినా.. అక్కడ కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని అనుకోవడం లేదన్నారు రేవంత్.. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నా.. వారికి అభ్యర్తి కరువయ్యాడని ఎద్దేవా చేసిన పీసీసీ చీఫ్.. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారని మండిపడ్డారు. మరోవైపు.. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల నియామకం ఉంటుందని.. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వస్తున్నారని తెలిపారు.