NTV Telugu Site icon

Minister Sridhar Babu: ఆ భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలి.. కేంద్ర మంత్రిని కోరిన శ్రీధర్‌ బాబు

Sridhar Babu

Sridhar Babu

Minister Sridhar Babu: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను చర్చించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద విక్రయించాలని నిర్ణయించినందున వీటి మిగులు భూములను తిరిగి అప్పగించాలని శ్రీధర్ బాబు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేయగా.. వాటికి అప్పట్లో వేలాది ఎకరాల భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

Read Also: Maharashtra Budget: ముందుగానే ప్రజలకు ఎన్నికల తాయిలాలు.. బడ్జెట్ అంతా వరాలే

ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించి స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని కోరారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ సిమెంటు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 2100 ఎకరాల సున్నపు రాతి గనులతో పాటు మొత్తం 2290 ఎకరాల భూమిని ఉచితంగా అందజేసిందని గుర్తు చేశారు. దీనిని ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నందున కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీస్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ముందుంది. ఇక్కడ భూములు, నీరు, విద్యుత్తు అవసరాల మేరకు అందుబాటులో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శిక్షణ పొందిన మానవ వనరులకు కొదవ లేదని, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ స్థాయిల్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ సమృద్ధిగా ఉందని వెల్లడించారు. రాష్ట్రాన్ని సందర్శించి ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలన్ని శ్రీధర్ బాబు అభ్యర్థనకు కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చి తన దృష్టికి తెచ్చిన అన్ని విషయాలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.