Site icon NTV Telugu

Rahul Gandhi and KTR Tour: వరంగల్‌లో పొలిటికల్‌ హీట్.. 6న రాహుల్‌, 7న కేటీఆర్..

Ktr Rahul Gandhi

Ktr Rahul Gandhi

ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్‌ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్‌ పర్యటించారు.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్‌ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్‌ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తుంది.. అయితే, మరుసటి రోజే అంటే ఈ నెల 7న మంత్రి కేటీ వరంగల్ ప‌ర్యటనకు రానున్నారు.

Read Also: Karnataka: పదవి చేపట్టి 9 నెలలే.. మళ్లీ సీఎంను మారుస్తున్న బీజేపీ..!

ఈసారి తన పర్యటనలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కైటెక్స్ మెగా టెక్ట్స్‌టైల్స్‌ పార్క్‌కు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు మంత్రి కేటీఆర్… అలాగే, గణేష్ టెక్ట్స్‌టైల్స్‌ ఇండస్ట్రీస్‌ను ప్రారంభిస్తారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ హనుమకొండలోని పీజేఆర్ గార్డెన్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్ కాబోతున్నారు.. ఐటీ రంగం, ఐటీ కంపెనీల విస్తరణ, అవకాశాలు, ఉపాధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక, ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు.. ఆ సమావేశం తర్వాత సాప్ట్ పాత్ ఐటీ ఆఫీసును సందర్శించే అవకాశం ఉంది. మరోవైపు కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేష్‌.. తదితర నేతలు సమావేశమై చర్చించారు. మొత్తంగా వరంగల్‌ వేదికగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అవుతుంటే.. మరుసటి రోజే తన పర్యటనలో కేటీఆర్‌ కౌంటర్‌ ఎటాక్‌ చేయబోతున్నారనే చర్చ సాగుతోంది.

Exit mobile version