NTV Telugu Site icon

ప్లీనరీకే తట్టుకోలేక పోతున్నారు.. విజయోత్సవ సభతో పిచ్చెక్కుతుంది..!

టీఆర్ఎస్‌ విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి జగదీష్‌ రెడ్డి.. నల్గొండ కలెక్టరేట్‌లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే కేవలం 24 లక్షల టన్నులే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సీఎం కేసీఆర్ చొరవతో 45 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌లో వరి సాగు మరింతగా పెరిగిందన్న ఆయన.. నల్గొండ జిల్లాలో గతంలో లాగా 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయన్నారు.. ధర విషయంలో రాజీలేదు, నాణ్యమైన పంటను మార్కెట్ కు తెచ్చి ధర పొందాలని.. రైతులు యాసంగిలో వరి ధాన్యం పండించే ఆలోచన చేయొద్దు, పండిస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయమని స్పష్టం చేశారు.

వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు మంత్రి జగదీష్‌ రెడ్డి.. వేరుశనగ, నువ్వులు, పెసళ్ళు, ఆవాలు, బొబ్బర్లు ఎంత పండించినా గింజ వృథా చేయకుండా కొనుగోలు చేస్తామన్న ఆయన.. ఈ పంటలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది, వరి కంటే ఎక్కువగా ఈ పంటలకే ఆదాయం వస్తుందన్నారు.. దేశానికి కావాల్సిన ధాన్యంలో సగం ధాన్యం తెలంగాణ రాష్ట్రమే పండించిందన్న ఆయన.. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు కానీ… ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకుడు విజ్ఞతతో బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఇక, నిన్న అద్భుతంగా జరిగిన ప్లీనరీని తట్టుకోలేక కొంత మంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. మరోవైపు.. రేపు విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుంది అంటూ సెటైర్లు వేశారు.