ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి… పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని ఆరోపించిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు… ఇక, వారి ఆటలు సాగవన్న ఆయన.. సీఎం జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదన్నారు.. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్ లేదన్నారు జగదీష్ రెడ్డి.. అధికారంలోకి వస్తామని పగటి కలలు కనే పగటి వేషగాళ్లు ఎక్కువగా ఉన్నారన్న ఆయన.. టీఆర్ఎస్ పార్టీని ఏదో చేస్తామనే వారి తరం కాదన్నారు.. కేసీఆర్ బతికున్నంత కాలం ప్రజలు కేసీఆర్ పాలనను వదులుకోరు.. పాలనలో కేసీఆర్‌ను మించిన వారు కనుచూపు మేరలో లేరని.. ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదు, ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించాయని ఆరోపించారు.