తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన ఎర్రబెల్లి.. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో వరి పంట పెరిగిందని గుర్తు చేశారు. ఇక, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు మంత్రి ఎర్రబెల్లి.
Read Also: CBI: అవినీతి కేసు.. సీబీఐ కస్టడీకి మాజీ హోంమంత్రి..
వరి ధాన్యాన్ని కొంటామని బండి సంజయ్ చెప్పారు… రా రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు వివక్షత చూపుతోందని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి.. కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పే వరకు వదిలేదిలేదని హెచ్చరించారు.. కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు రాజ్యసభలో వ్యతిరేకించామని.. అందువల్లనే తెలంగాణ రైతాంగాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి.. రైతులంతా ఏకం కావాలి.. జిల్లా వ్యాప్తంగా రేపు ధర్నాలు చేపడుతున్నామని పిలుపునిచ్చారు.. ఇక, 8వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటిపై నల్ల జెండా ఎగరేసి చావు డప్పు, బీజేపీ శవయాత్ర చేపట్టాలన్నారు. 11వ తేదీన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయన్న ఆయన.. ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించారు.. ఇక, విభజన చట్టంపై కూడా కేంద్రం మాటనిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.