తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హస్తిన టూర్ పొలిటికల్ హీట్ పెంచుతోంది… కొంత కాలంగా తెలంగాణ సర్కారుకు గవర్నర్ మధ్య కొనసాగుతున్న గ్యాప్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఢిల్లీలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యాసంగి ధాన్యం కేంద్రం కొనాల్సిందేనంటూ.. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్.. అటు ఢిల్లీలోనూ దీక్షకు సిద్ధమవుంది. సీఎం కేసీఆర్ ధర్నాలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్రం పెద్దలను కలిసివెళ్లారు. అనంతరం తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఢిల్లీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా వ్యవహారాలు సాగుతున్న పరిస్ధితుల్లో.. తమిళిసై ఢిల్లీ పర్యటన పొలిటికల్ హీట్ మరింత పెంచింది.
Read Also: IPL: మారని ముంబై తీరు.. వరుసగా మూడో ఓటమి..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ప్రధానికి ఆమె వివరించారు. ప్రొటోకాల్ వివాదాలపైనా ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ తర్వాత గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వివాదాలు కోరుకోనని, వ్యక్తిగతంగా ఇగోలకు పోయేదాన్ని కానని తమిళిసై అన్నారు. మంత్రులు, అధికారులను రాజ్ భవన్ వెళ్లనీయకుండా ప్రగతి భవన్ కట్టడి చేస్తోందనే ఆరోపణలను ప్రస్తావించారు. రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు ఎప్పుడైనా రావొచ్చని, ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చని, గవర్నర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే గవర్నర్ వచ్చి పెద్దలను కలవడం, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన స్వరాన్ని కాస్త గట్టిగానే వినిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, గవర్నర్ మాత్రం తాను ఢిల్లీకి వచ్చింది కేసీఆర్ సర్కారుపై ఫిర్యాదు చేయడానకి కాదని, రాష్ట్రంలో ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు, గిరిజన ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం సాయం చేయాల్సిందిగా ప్రధానిని కోరానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న తమిళిసై ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.