NTV Telugu Site icon

Anti Dowry Act: బాబోయ్‌ ఇది నిజమా.. కట్నం తీసుకుంటే కటకటాలకేనా?

Anti Dowry Act

Anti Dowry Act

Anti Dowry Act: ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు. వరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటే చాలు.. భూములు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతే.. పెళ్లయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తే.. తట్టుకోలేక వివాహితలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన ఈ వరకట్నం విషయంలో మాత్రం పాత సంప్రదాయాలే కొనసాగుతుండటం బాధాకరం. ఇవ్వగలిగిన వారి పరిస్థితి అలా ఉంచితే.. ఇవ్వలేని వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినా.. వాటిని పాటించే వారు తక్కువే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వరకట్న సంప్రదాయానికి చరమగీతం పాడేలా కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. వరకట్నం విషయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Read also: Pushpa 2: ఆమె అసలు ‘రష్మిక కాదు ‘ఇషా’

వరకట్నం తీసుకునే వరుడి పట్టా రద్దు విధానాన్ని కేరళ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం కేరళలో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేరళలోని వరకట్న వ్యతిరేక విధానాన్ని హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ అధ్యయనం చేశారు. కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో… ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేస్తే… మంచి ఫలితాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదనలు కూడా సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు అవసరమైన ప్రోటోకాల్‌లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఉన్నత విద్యామండలి, మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరకట్నం తీసుకుంటే పట్టా రద్దు విధానాన్ని అమల్లోకి తెస్తే ఇలాంటి సంప్రదాయానికి పూర్తిగా స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
MNJ Hospital: ఆసుపత్రిలోనే పాఠశాలు.. క్యాన్సర్ బాధిత పిల్లలకు సర్కార్ గుడ్ న్యూస్