Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!

Konda

Konda

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రభుత్వం, పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా బహిరంగంగా విమర్శలు గుప్పించిన నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మంత్రి కొండా సురేఖతో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిలకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు పంపించింది.

కొండా సుస్మితా వ్యాఖ్యలపై సురేఖకు ఆదేశాలు

వరంగల్‌లో నిర్వహించిన ఓ వేదికపై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. రాబోయే ఎన్నికల్లో పరకాల అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంబీకి ఎలా ఉంటుందని నిలదీస్తూ, అధిష్ఠానంతో సంబంధం లేకుండా తాను పరకాల నుంచే పోటీ చేస్తానని సుష్మిత బహిరంగంగా వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వం, నాయకత్వంపై ఇటువంటి విమర్శలు చేయడం తీవ్ర క్రమశిక్షణా రాహిత్యమని స్పష్టం చేసిన అధిష్ఠానం, ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించింది.

వనపర్తి రాజకీయంలో చిన్నారెడ్డికి నోటీసు

మరోవైపు వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చెలరేగిన వివాదం కూడా అధిష్ఠానం వద్దకు చేరింది. స్థానిక ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించడం వల్లే తనకు టికెట్ దక్కలేదని, దీని కారణంగానే వనపర్తి నియోజకవర్గం నాశనమైందని ఆయన బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ తీవ్రమైన కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణా కమిటీ, తన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని చిన్నారెడ్డికి స్పష్టం చేసింది.

లైన్ దాటితే సహించేది లేదని హెచ్చరిక

పార్టీ ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ పెద్దలపై లక్ష్మణ రేఖ దాటి బహిరంగ విమర్శలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ హెచ్చరించింది. ఇద్దరు ప్రముఖ సీనియర్ నేతలకు ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ కావడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు పార్టీలోని అసమ్మతివాదులకు ఎలాంటి హెచ్చరికగా మారనున్నాయో వేచి చూడాల్సి ఉంది.