NTV Telugu Site icon

CM Revanth Reddy: పెట్టుబడులకు అవకాశం ఉంది..13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌లో 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. ఈ విందుకు అమెరికా, ఇరాన్, టర్కీ, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్వాగతం పలికి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ‘అభయహస్తం’తో అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర నేతలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం సమానత్వం, పారదర్శకతతో పనిచేస్తోందని వెల్లడించారు.

Read also: OIL Recruitment 2024: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువత భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయా దేశాలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
OIL Recruitment 2024: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?