తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పీడ్ పెంచారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఈడీ, ఐటీ దాడులు, సీబీఐ సోదాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రానున్న ఎన్నికలకు ముందే కేసీఆర్ గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. సొంత స్థలం ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం పథకం అమలు చేయనున్నారు.. సొంత స్థలం ఉంటే 3 లక్షల రూపాయాలు ప్రభుత్వ సాయం చేయనుంది.. 10న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనున్నారు.. అన్ని నియోజకవర్గాల్లో అర్హులను గుర్తించి.. 15 రోజుల్లోనే నిధులను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు..
Read Also: Andhra Pradesh Crime: ఏపీలో మెడికో హత్య కలకలం.. అసలు కారణం ఇదేనా..?
మరోవైపు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందోని కేసీఆర్ సర్కార్ ఫైర్ అవుతోంది.. రుణాల సేకరణకు కొర్రీలు వేస్తోందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్న సంగతి విదితమే కాగా.. ఈ నేపథ్యంలో రుణాల్లో కోత, పథకాలకు నిధులు ఇవ్వకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం, కృష్ణా జలాల విభజనలో జాప్యం సహా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.. ఇక, రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలను వాడుకోవడంపైనా చర్చించనున్నారు. మరోవైపు, అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయడంతో పాటు.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది..