రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన రెండో రోజు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. తొలుత భారీస్థాయి ఏర్పాటు చేసిన శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరామానుజచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని తెలిపారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అన్నారు. రామానుజచార్యులు అందరినీ సమానంగా ప్రేమిస్తారని… మనం కూడా రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
కాగా రెండోరోజు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలతో బాలాగ్నిని రగిలించిగా 9 నిమిషాల్లో అగ్ని ఉద్భవించింది. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ 1035 కుండలాలు ఉన్న యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు ప్రారంభమైంది. అనంతరం చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై శ్రీలక్ష్మీనారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి హాజరైన వైష్ణవ స్వాములకు మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు దీక్షావస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొని చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలు అందుకున్నారు.