Telangana cabinet meeting: కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ సమావేశం జరగలేదు. తెలంగాణ కేబినెట్ చివరి సమావేశం మార్చి నెలలో జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నేడు కేబినెట్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై కూడా చర్చ జరగనుంది.
జూన్ 2 నుంచి 21 రోజుల పాటు జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేయడంతో పాటు పలు పాలనాపరమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే మంచి తరుణమని కేసీఆర్ భావించి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. సచివాలయం ఎదుట సిద్ధం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభ తేదీ ఖరారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్ నామినేట్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీకాలం ఈ నెల 27తో ముగియనుండగా.. రెండు స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు సిఫారసు చేసే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వాటికి సంబంధించి తదుపరి చర్యలు ప్రస్తావించే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన సన్నాహక ప్రణాళికపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రయోజనాలు కల్పించడంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
America: ఆఫీస్‌కు వెళ్తూ అదృశ్యం.. పక్క రాష్ట్రంలో శవమై కనిపించిన భారత సంతతి మహిళ