Site icon NTV Telugu

Harish Rao : సభ 15 రోజులు కావాలి.. కానీ ఎందుకు రెండే రోజులు పెట్టారు.?

Harish Rao Bhai

Harish Rao Bhai

Harish Rao : అసెంబ్లీ స్పీకర్‌ ఛాంబర్‌లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను పట్టించుకోకుండా కేవలం రెండే రోజులు సభ నడపాలని నిర్ణయించడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “BAC సమావేశంలో వర్షాల వల్ల జరిగిన నష్టాలపై, ఎరువుల సమస్యపై, విషజ్వరాలపై, ఫోర్త్ సిటీలో జరుగుతున్న అక్రమాలపై, పేదల కష్టాలపై చర్చ జరపాలని కోరాం. కానీ చర్చకు సమయం ఇవ్వకుండా రెండే రోజులు సభ పెట్టాలని నిర్ణయించారు. వరదలపై మాట్లాడుదామని అంటే బురద రాజకీయాలపై మాట్లాడుదామని అంటున్నారు. ఇది ప్రజలకు అన్యాయం” అని అన్నారు.

Telaganan Cabinet : కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌లు

అలాగే, రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. “రైతుల కష్టం వారికి చీమ కుట్టినట్లు లేదు. ఎరువుల కొరతపై చర్చిద్దామన్నా సిద్ధంగా లేరు. బీజేపీ ఇవ్వడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా అయితే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు. సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ జరగనుంది. అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతించాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.

మధ్యలో గణేష్ నిమజ్జనం, వరదల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సభకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అయితే రేపటి అసెంబ్లీ పూర్తి ఎజెండా ఇంకా ఖరారు కాలేదని, రాత్రికి డిసైడ్ చేసి ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పిందని హరీష్ రావు విమర్శించారు. “ముందు చెప్పకపోతే ప్రతిపక్షం ఎలా ప్రిపేర్ అవుతుంది? ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరేమీ కాదు” అని అన్నారు.

PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..

Exit mobile version