Ponnam Prabhakar : బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల గణన సర్వే నిర్వహించామని, ఆ సర్వే ఆధారంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంచే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయానికి చట్టసభలలో అన్ని పార్టీల మద్దతు లభించిందని, మూడ్ ఆఫ్ హౌజ్ తీసుకున్న తర్వాతే బిల్లు ఆమోదించబడి గవర్నర్‌కు పంపించామని చెప్పారు. అనంతరం గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారని తెలిపారు.
తమిళనాడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు కూడా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని పొన్నం గుర్తు చేశారు. దాని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసిందని అన్నారు. “10 శాతం EWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని మంత్రి హామీ ఇచ్చారు.
“రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం. మా నోటి కాడి ముద్ద లాగవద్దు. తెలంగాణ సమాజం మొత్తం కలిసి ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్” అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గతంలో బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేశారు. “పది ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారు, ఎంతమందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారు? కవిత స్వయంగా చెప్పినట్టుగా వాళ్ల ఇళ్ళలో బంగారం ఉంటే తెలంగాణ అంతా బంగారం కాలేదు” అంటూ ఎద్దేవా చేశారు.
Musi River : పురానాపూల్ వంతెన వద్ద ప్రమాద స్థాయిని దాటిన వరద
