Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!

  • వికసిత్ భారత్‌ సదస్సులో తెలంగాణ విజన్
  • 2047 నాటికి $3 ట్రిలియన్‌ ఎకానమీ లక్ష్యం
  • కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
  • తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌తో భవిష్యత్‌ ప్రణాళిక
Bhatti Vikramarka

Bhatti Vikramarka

దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. 2047 నాటికి భారతదేశం సాధించాల్సిన సమగ్ర ఆర్థిక వృద్ధి, ఆ దిశగా వివిధ రాష్ట్రాలు పోషించాల్సిన పాత్ర , అనుసరించాల్సిన ప్రణాళికలపై ఈ సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, రాష్ట్ర ప్రభుత్వ విజన్ , ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా వివరించారు.

2047 నాటికి $3 ట్రిలియన్ల ఎకానమీ సాధనే తెలంగాణ ధ్యేయం

ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి తమ ప్రభుత్వ ప్రణాళికలను సభ దృష్టికి తీసుకెళ్లారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే 2025 డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని, దానికి అవసరమైన సమగ్ర ప్రణాళికలు , విధానాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

‘వికసిత్ భారత్’ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ భాగస్వామ్యమే

వికసిత్ భారత్ భావనపై మాట్లాడిన భట్టి విక్రమార్క, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన అంశం కాదని స్పష్టం చేశారు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని, ప్రతి రాష్ట్ర అభివృద్ధి ఇందులో భాగమేనని గుర్తుచేశారు. కేంద్రం , అన్ని రాష్ట్రాల సమగ్ర సహకారం, సమిష్టి భాగస్వామ్యంతోనే దేశం అనుకున్న ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించగలదని ఆయన ఉద్ఘాటించారు.