తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయగా.. గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: PM Modi security: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..
తాను చదువుకున్నప్పుడే వివాహం చేసుకున్నా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో పాసైనట్టు గవర్నర్ తమిళిసై గుర్తు చేసుకున్నారు. కాబట్టి వైద్య విద్యార్థులందరూ వయసులో ఉండగానే వివాహం చేసుకోవాలని ఆమె సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేయడం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, పీజీ పూర్తి చేయడం వంటి విషయాలను కూడా గవర్నర్ గుర్తుచేసుకున్నారు. కొందరు చదువు పేరుతో వివాహాలు ఆలస్యంగా చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లని కోటులో తనను డాక్టర్‌గా చూడాలని తన తల్లి పడిన తపనను గవర్నర్ వివరించారు. కాగా ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిమ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. సర్జరీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా సాధారణ ప్రసవాలు చేయాలని వైద్య విద్యార్థులకు కీలకంగా సూచించారు.