NTV Telugu Site icon

Teegala Krishna Reddy: మంత్రి సబితకు మరో తలనొప్పి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Teegala Krishna Reddy

Teegala Krishna Reddy

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన సొంత నియోజకవర్గం మహేశ్వరంలో తలనొప్పులు తప్పడం లేదు.. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న బడంగ్‌పేట్‌లో సబితా ఇంద్రారెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. మున్సిపల్‌ ఎన్నికల్లో బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థానాన్ని టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది.. కానీ, తాజాగా, టీఆర్ఎస్‌ నుంచి మేయర్ చిగురింత పారిజాతా నరసింహారెడ్డి తిరిగి సొంతగూడైన కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు.. ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలిసిన తర్వాత పార్టీ కండువా కప్పుకోవడంతో మంత్రి సబితకు షాక్‌ తగిలినట్టు అయ్యింది.. మరోవైపు, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు మంత్రి సబితను టార్గెట్‌ చేయడంతో కొత్త తలనొప్పి మొదలైనట్టు అయ్యింది.

మంత్రి సబితపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మీర్‌పేట్‌ మున్సిపాలిటీని సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు తీగల.. అంతేకాదు, తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.. ఇక, మంత్రి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపించిన ఆయన.. చెరువులు, స్కూళ్ల స్థలాలను కూడా వదలడం లేదని విమర్శించారు.. టీఆర్ఎస్ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని.. ఇదే సమయంలో అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడనున్నట్టు వెల్లడించారు..

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా మరోసారి తీగల కృష్ణారెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామలతో.. టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.. ఆమెను మంత్రి పదవి కూడా వరించింది.. అయితే, టీఆర్ఎస్‌లో మంత్రి సబిత కంటే సీనియర్‌గా ఉన్న తీగల కృష్ణారెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది.. ఈ రెండు వర్గాల మధ్య ఆదినుంచి ఆధిపత్య పోరు సాగుతున్నా.. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో బహిర్గతం అయ్యాయి. వరుస పరిణామాలు తన సొంత నియోజకవర్గంలో మంత్రి సబితకు తలనొప్పిగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show comments