కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ అదుపులోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతోందనే వార్త ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. సుమారు 200కు పైగా కేసులు నమోదు కూడా అయ్యాయని, మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయని విశ్వయనీయ సమాచారం. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పలుదేశాలు, రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంకీపాక్స్ వైరస్ నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పలు దేశాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల మంకీపాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒంటిపై దుద్దర్లు, రాషెస్ వచ్చిన అనుమానితులు వైద్యాధికారులను సంప్రదించాలని కోరింది. అనుమానితుల బ్లడ్ శాంపిళ్లను పూణెలోని ఎన్ఐవీకి పంపి టెస్టు చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా.. యురోప్, నార్త్ అమెరికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్పై తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆఫ్రికా, యూరోప్ లోని 14 దేశాలలో ఇప్పటికే ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కాగా తాజాగా తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అదుపులో ఉంచేందుకు ముందస్తు జాగ్రత్త చేపడుతున్నాయి.
గత 21 రోజుల ముందు విదేశీ పర్యటన చేసిన ప్రయాణికులలో దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నవారిని స్క్రీనింగ్ టెస్టులు చేసి, వారిని ఐసోలేషన్లో చేర్చాలని తమిళనాడు ఆరోగ్య శాఖ కన్వీనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మంకీపాక్స్ వైరస్ అనుమానితులకు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని కస్తూరీబాయి ఆసుపత్రిలో 28 పడకల వార్డులను సిద్ధం చేసింది. కాగా సోమవారం బాంబే మెడికల్ కౌన్సిల్ ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు ఏమీ నమోదు కాలేదని ఓ ప్రకటన జారీ చేసింది. అయినప్పటికీ ఆసుపత్రులు “అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
మరో వైపు రాజస్థాన్ లో ఇటీవల విదేశీ పర్యటనలు చేసివచ్చిన వారిలో మంకీపాక్స్ అనుమానితులు నమూనాలను సేకరించి వాటిని నేషనల్ వైరాలజీ సంస్థకు పంపాలని ఆరోగ్యశాఖ వైద్యాధికారులను పేర్కొన్నారు.