తెలంగాణ విద్యుత్ చార్జీల పెంపుపై తెలంగాణ రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) చైర్మన్ శ్రీరంగారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకపోతే, సుమోటోగా తీసుకొని విద్యుత్ ఛార్జీలు పెంపు పై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎవరికీ నష్టం జరగకుండానే విద్యుత్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. సరైన సమయానికి విద్యుత్ డిస్కంలు, ఏ ఆర్ ఆర్ సమర్పించక పోవడంతో గతంలో ఇచ్చిన వాటిని తిరస్కరించినట్టు చెప్పారు. విద్యుత్ సంస్థలు కరెంట్ చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ సమర్పించేందుకు మరొకసారి గడువు ఇచ్చామన్నారు.
చార్జీలు పెంచిన, పెంచకపోయినా ప్రతి ఏడాది విద్యుత్ డిస్కంలు విధిగా ఏఆర్ఆర్ సమర్పించాల్సిందేనన్నారు. నవంబర్ మొదటి వారంలో కల్లా ఏఆర్ఆర్ లు, టారిఫ్ ప్రపోజల్స్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నాలుగేళ్లుగా విద్యుత్ డిస్కంలు ఏఆర్‌ఆర్‌లను సమర్పించడం లేదన్నారు. ఈనెల 27 తర్వాత డిస్కంలు టారీఫ్ అందించకపోతే ఈఆర్సి నిబంధనల ప్రకారం జరిమానా వేసే హక్కు ఉంటుందన్నారు. డిస్కంలు మరోసారి ఏఆర్ఆర్ లు, టారిఫ్‌లు సరైన సమయంలో అందించకపోతే తామే విద్యుత్ చార్జీలపై పబ్లిక్ హియరింగ్ చేసి చార్జీల పెంపు ప్రకటన చేస్తామన్నారు. చార్జీల పెంపు స్వల్పంగానే ఉండొచ్చని శ్రీరంగారావు పేర్కొన్నారు.