తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్ అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు.
ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు గురి చేస్తోంది. బీజేపీ తిరుగులేని శక్తిగా తయారవుతున్న నేపథ్యంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి.రైతులకు, బీజేపీకి మధ్య తగువు పెట్టాలని కేసీఆర్ ఆడిన అబద్దాలను ప్రజలెవరూ నమ్మడం లేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకుని తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
తక్షణమే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని బాపూరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేంత వరకు బీజేపీ వదిలిపెట్టే ప్రసక్త లేదు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమన్నారంటే…
ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. టీఆర్ఎస్ పార్టీని జనం అసహ్యించుకుంటున్నా సీఎం కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడం సిగ్గు చేటు.
టీఆర్ఎస్ పార్టీయే ఓ అబద్దాల ఫ్యాక్టరీ… ప్రజలను తప్పుదోవ పట్టించడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు.తెలంగాణ నుండి ఎంత ధాన్యం పంపిస్తారనే వివరాలను కూడా ఇంత వరకు కేంద్రానికి పంపకపోవడం దారుణం.ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచేలా ఉన్నాయి.కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఏనాడూ సకాలంలో ఇవ్వని చరిత్ర కేసీఆర్ సర్కార్ దే.2019-20 సంవత్సరానికిగాను తెలంగాణ నుండి రావాల్సిన లక్ష మెట్రిక్ బియ్యాన్ని నేటికీ కేంద్రానికి పంపకపోవడం దారుణం అన్నారు ధర్మపురి అరవింద్.