నేటి నుంచి యాదాద్రిలో మూడు రోజులపాటు లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంతోపాటు దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. ఈ సంబరం నిర్వహణకు ఆచార్య బృందం.. ఆలయ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు.
పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత, ప్రధాన పూజారి నల్లంథిదిగల్ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. తర్వాత స్వస్తివచనం, లక్ష కుంకుమార్చన, సాయంత్రం మృత్యంగ్రహణం, అంకురార్పణ, హవనం, తిరువెంకటపతి గరుడ వాహన సేవోత్సవం నిర్వహిస్తారు.
శనివారం ఉదయం మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్దనుడు, సాయంత్రం హవనం, హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారోత్సవం జరుపుతారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మూలమంత్ర హవనం, 9 గంటల నుంచి పూర్ణాహుతి, సప ఘటా క్రం నిర్వహణ, రాత్రి నృసింహ జయంతి, నృసింహావిర్భావం పర్వాలు నిర్వహిస్తారు. ప్రధానాలయంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు స్వామి జయంతి మహోత్సవ వేడుకలు జరుగుతాయని ఈవో గీత పేర్కొన్నారు.
కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కంచి పీఠాధిపతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వయంభూ మూర్తులను స్వామీజీ దర్శించుకున్నారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామీజీకి వస్త్రాలు, పండ్లు అందజేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో స్వామీజీ ప్రవచనం చేస్తూ…. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ప్రశంసించారు. యాదాద్రి కొండపై అనుబంధంగా కొనసాగుతున్న పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
LIVE: కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన