Ujjaini Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. అదయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైను ఎంజీ రోడ్డు రాంగోపాల్‌పేట పాత పోలీస్‌స్టేషన్ కొత్త ఆర్చి గేట్ నుంచి మహంకాళి పోలీస్ స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లాలి.
Read also: Train : రైలులో డోర్ వద్ద కూర్చున్న వారిపై బెల్టుతో దాడి.. వైరల్ వీడియో
సికింద్రాబాద్ జనరల్ బజార్ వీఐపీల కోసం 1 క్యూ, అంజలి టాకీస్ వైపు నుంచి సాధారణ భక్తుల కోసం 1 క్యూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట పీఎస్ నుంచి నిత్యం భక్తుల కోసం క్యూ ఉంటుంది. డోనర్ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనుక నుంచి మరో క్యూ ఉంది. పాత రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంజీ రోడ్డు నుంచి అమ్మవారి ఆర్కిగేట్ మీదుగా వీవీఐపీలను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగరంలోని దాదాపు 19 ప్రాంతాల నుంచి సిటీ బస్సులను బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు మళ్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల జాతరకు హాజరయ్యే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.