SC Cell President Preetham Demands Kavitha To Resign: టీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రౌడీ సమితిగా మారిందని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య అంతర్గత మితృత్వం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. అమిత్ షా కాళ్లను నాలుగు గోడల మధ్య పట్టుకుంటే.. ఈడీ, సీబీఐ దాడులు జరగవని కేసీఆర్ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని, లిక్కర్ కుంభకోణం నుంచి ఎమ్మెల్సీ కవితను బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. క్యాబినెట్ సమావేశాల మాదిరిగా.. కవితకు తాముంటామంటూ మంత్రులు ఆమె ఇంటికి వెళ్లడం సిగ్గులేని తనమనం విమర్శలు గుప్పించారు.
గతంలో తెలంగాణ ఆడపడుచులకు గుజరాత్ నుంచి నాసిరకం బతుకమ్మ చీరలు తీసుకొచ్చి, భారీ కుంభకోణానికి పాల్పడ్డారని.. ఆ స్కామ్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా పరిహారం ఇవ్వలేదని ఆగ్రహించిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంకలో అధ్యక్షుడుకి పట్టిన గతే.. తెలంగాణలో కేసీఆర్‌కి పడుతుందని జోస్యం చెప్పారు. కవితపై వస్తున్న ఆరోపణలకు రాజీనామా చేసి.. ప్రజాక్షేత్రంలోకి రావాలని పిలుపునిచ్చారు. మీరే ఈడీ, సీబీఐకి లేఖ రాసి.. విచారణ చేయాలని నిరూపించుకోవాలని కవితను సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకోవడం ఒక డ్రామా మాత్రమేనని, అందరినీ కాంగ్రెస్ పార్టీ దోషులుగా నిలబెడుతుందని ప్రీతమ్ హెచ్చరించారు.